వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద రూ.277.45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి
ప్రచురణ తేది : 08/10/2021
పత్రికా ప్రకటన-4
వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద రూ.277.45 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రిజగన్ మోహనరెడ్డి
విజయనగరం, అక్టోబరు 07: వైఎస్ఆర్ ఆసరా క్రింద 4లక్షలా, 72వేల, 634 మంది మహిళలు, రూ.277.45కోట్ల రూపాయలను రుణ మాఫీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. గురువారం ఒంగోలులో జరిగిన ఆసరా 2వ విడత ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని, నగదు విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి, జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్ర శేఖర్, శాసన మండలి సభ్యులు డా.సురేష్ బాబు, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, బద్దుకొండ అప్పల నాయుడు,శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, జిసిసి చైర్మన్ డా.శోభ స్వాతి రాణి తిలకించారు.
వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద మొదటి ఏడాది నవంబరు 9, 2020న జిల్లాలో 36,908 మహిళా సంఘాలకు చెందిన, 4,22,606 మంది సభ్యులకు రూ.231.80 కోట్లను, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రెండో విడత క్రింద అక్టోబరు 7న, వైఎస్ఆర్ క్రాంతి పథం పరిధిలోని జిల్లాకు చెందిన 37,003 పొదుపు సంఘాలకు చెందిన 4,08,112 మంది సభ్యులకు, రూ.232.75 కోట్లను జమ విడుదల చేసారు. ఇలా నాలుగేళ్లలో సుమారు రూ.929.15 కోట్లను మహిళలకు నేరుగా నగదు రూపంలో అందజేయడం ద్వారా, వారి ఆర్థికాభివృద్దికి దోహదం చేయనున్నారు. మున్సిపల్ ప్రాంతాలకు చెందిన మెప్మా పరిధిలోని మహిళా పొదుపు సంఘాలకు మొదటి విడతగా 6,351 గ్రూపులకు చెందిన 63,564 మంది సభ్యులకు, రూ.43.49కోట్లను గతేడాది విడుదల చేశారు. రెండో విడత క్రింద గురువారం 6,443 సంఘాలకు చెందిన 64,522 మంది సభ్యులకు, రూ.44.70 కోట్లను జమచేసారు.
పదిరోజుల పాటు ఆసరా ఉత్సవాలు:: జిల్లా కలెక్టర్ సూర్య కుమారి
అక్టోబర్ 8వ తేదీ నుండి 18 వరకు జిల్లా అంతటా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వై.యస్.ఆర్. ఆసరా ఉత్సవాలను పదిరోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. మీడియా తో ఆమె మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో ఆయా నియోజకవర్గ ఎంఎల్ఏలు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో ఆసరా చెక్కులను పొదుపు సంఘాలకు పంపిణీ చేయడమే కాకుండా, వై.యస్.ఆర్, చేయూత, సున్నావడ్డీ, దిశా యాప్, మహిళా సాధికారతకు సంబంధించిన వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, చేదోడు, తోడు తదితర పథకాలకు సంబంధించి, మంజూరు పత్రాలను కూడా పంపిణీ చేస్తారని, మహిళల విజయగాధలను వివరించడమే కాకుండా, వారు స్థాపించిన యూనిట్లను, తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న నగదు సాయానికి, మరికొంత రుణాన్ని తీసుకొని స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని, చిన్నచిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా, మహిళా పారిశ్రామిక వేత్తలుగా మహిళలు అభివృద్ది చెందాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో డి.ఆర్.డి.ఏ పి.డి అశోక్ కుమార్, మెప్మా పి.డి సుధాకర్, .డి.పి.ఎం లు , సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మహిళ సంఘాలకు మెగా చెక్కును అందజేశారు.
————————————————————————————————————————————-
జారీ: సహాయ సంచాలకులు, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయనగరం.