15.12.2025 ఇంధన పొదుపు ప్రగతికి మార్గం, జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, పట్టణంలో భారీ అవగాహనా ర్యాలీ
పత్రికా ప్రకటన-2
ఇంధన పొదుపు ప్రగతికి మార్గం
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
పట్టణంలో భారీ అవగాహనా ర్యాలీ
విజయనగరం, డిసెంబరు 15 ః ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. మనం పారిశ్రామికంగా అభివృద్ది చెందాలంటే, ఖచ్చితంగా విద్యుత్‌ను పొదుపుచేయాల్సిన అవసరం ఉదని స్పష్టం చేశారు. ఇంథన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విజయనగరం పట్టణంలో సోమవారం నిర్వహించిన అవగాహనా ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఇంధన పరిరక్షణపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ ర్యాలీ సంతకాల వంతెన, ఆర్టిసి కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు సాగింది.
ర్యాలీ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు ఆవశ్యకతను వివరించారు. ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్టేనని అన్నారు. ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న క్రమంలో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని చెప్పారు. అందువల్ల ప్రతీఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం విద్యుత్‌ను ఆదా చేసే 5 స్టార్ పరికరాలను వినియోగించాలని, అవసరమైనప్పుడే విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని సూచించారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకొని, వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. విద్యుత్‌ను వృధా చేయోద్దని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్ బాబు, బి.రఘు, ఏడిఈ కిరణకుమార్, డిఈలు, ఏఈలు, విద్యాశాఖ ఏడి అరుణజ్యోతి, పెద్దసంఖ్యలో విద్యుత్ సంస్థ ఉద్యోగులు, నెడ్‌క్యాప్ ప్రతినిధులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

15-12-1

15-12-2

15-12-3