పైడిమాంబ సిరిమాను చెట్టుకు పూజలు సిరిమానోత్సవానికి అందరికి అనుమతి : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
- Start: 28/09/2022
- End: 15/10/2022
Venue: Vizianagaram
పైడిమాంబ సిరిమాను చెట్టుకు పూజలు సిరిమానోత్సవానికి అందరికి అనుమతి : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విజయనగరం, సెప్టెంబర్ 28: ఉత్తరాంధ్ర కల్పవల్లి, శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టుకు, బుధవారం గంట్యాడ మండలం సిరిపురంలో ఘనంగా పూజలు నిర్వహించారు. సిరిమాను తయారీ ప్రక్రియలో భాగంగా, ముందుగా సిరిమాను, ఇరుసుమాను చెట్లకు, నిర్ణయించిన ముహూర్తం ఉదయం 8.15 గంటలకు, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, చెట్లను నరికే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చెట్లను నరికి బుధవారం సాయంత్రానికి విజయనగరం పట్టణం, హుకుంపేటలోని పూజారి ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, పైడితల్లి అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని, అమ్మవారి దయతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలకు అనుగుణంగా, అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమ్మవారి సిరిమానోత్సవాన్ని భక్తులు నేరుగా తిలకించలేకపోయారని, ఈ ఏడాది అందరినీ ఉత్సవానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.
కలెక్టర్ ఎ. సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎంమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎంమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, ఆలయ ఈఓ కిషోర్, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.