Close

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన పథకాన్ని విజయవంతంచేయాలి– జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

Publish Date : 23/12/2025

ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన పథకాన్ని విజయవంతం చేయాలి

– జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి

విజయనగరం, డిసెంబర్ 22:

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ యోజన (PMAGY) పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పథకంలో భాగంగా, 500 జనాభా కలిగి, జనాభాలో కనీసం 40 శాతం షెడ్యూల్డ్ కులాల వారు నివసించే గ్రామాలను ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని మెరకముడిదాం, వంగర, తెర్లాం, ఆర్.ఆమదాలవలస మండలాల నుండి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ప్రతిపాదించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ పథకానికి సాంఘిక సంక్షేమ శాఖను నోడల్ శాఖగా నియమించడం జరిగిందని, వారి సమన్వయంతో ఆయా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి చర్యలు చేపట్టాలని సూచించారు.

ఎంపిక చేసిన గ్రామాల్లో

త్రాగునీరు, విద్య, వైద్యం, సోషల్ సెక్యూరిటీ, గ్రామీణ రహదారులు, విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక అభివృద్ధి, డిజిటలైజేషన్

జీవనోపాధి మరియు నైపుణ్యాభివృద్ధి

వంటి పది కీలక రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి జరిగేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ పథకం కింద ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.20 లక్షల నిధులు అందుతాయని, అదనపు అవసరాలకు సంబంధిత శాఖల ద్వారా కన్వర్జెన్స్ పద్ధతిలో నిధులు సమీకరించి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ ఎం. అన్నపూర్ణమ్మ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, జడ్పీ సీఈఓ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్ఇ  తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

——————————————————————————————

జారీ: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, విజయనగరం

231225-B

 

231225-A