Close

వైద్య స‌దుపాయాల‌ను మెరుగుప‌ర్చాలి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి, జిజిహెచ్ అభివృద్దికి ప‌లు కీల‌క‌ నిర్ణ‌యాలు

Publish Date : 10/12/2025

వైద్య స‌దుపాయాల‌ను మెరుగుప‌ర్చాలి

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

జిజిహెచ్ అభివృద్దికి ప‌లు కీల‌క‌ నిర్ణ‌యాలు

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 09 ః     జిల్లా ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న భోద‌నాసుప‌త్రిలో, అనుబంధ ఘోషాసుప‌త్రిలో వైద్య స‌దుపాయాల‌ను మెరుగు ప‌ర్చేందుకు, అద‌న‌పు వ‌స‌తులు క‌ల్పించేందుకు త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధుల‌తో అత్య‌వ‌స‌ర‌ వైద్య ప‌రిక‌రాల‌ను వెంట‌నే కొనుగోలు చేయాల‌ని సూచించారు. భ‌వ‌నాలు, ఇత‌ర మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించాల‌ని చెప్పారు. భ‌వ‌నాలు ఇత‌ర మౌలిక స‌దుపాయాల కోసం మ‌రో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. టిబి ఆసుప‌త్రి, ఆవ‌ర‌ణ‌ను అభివృద్ది చేసేందుకు ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని చెప్పారు. జిల్లా క‌లెక్ట‌ర్ మ‌రియు సొసైటీ ఛైర్మ‌న్ రాంసుంద‌ర్ రెడ్డి, కో ఛైర్మ‌న్ మ‌రియు విజ‌య‌న‌గ‌రం ఎంఎల్ఏ పూస‌పాటి అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు ఆధ్వ‌ర్యంలో ఆసుప‌త్రి అభివృద్ది సొసైటీ స‌మావేశం జిజిహెచ్ స‌మావేశ మందిరంలో మంగ‌ళ‌వారం జ‌రిగింది.

              ఈ స‌మావేశంలో ఆసుప‌త్రి అభివృద్దికి, వైద్య సేవ‌ల‌ను మెరుగుప‌రిచేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, నిధుల వినియోగంపై చ‌ర్చించారు. ప్ర‌ధానంగా మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై చ‌ర్చ జ‌రిగింది. జిజిహెచ్‌లోని అత్య‌వ‌స‌రేత‌ర విభాగాల‌ను గాజుల‌రేగ స‌మీపంలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లోనికి త‌ర‌లించే అంశంపై త్వ‌ర‌లో క‌లెక్ట‌ర్ ఆద్వ‌ర్యంలో ప్ర‌త్యేక స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. జిజిహెచ్‌లో ఉన్న డిసిహెచ్ఎస్ కార్యాల‌యం, హోమియో వైద్య‌శాల‌, ఏఆర్‌టి సెంట‌ర్‌ త‌ర‌లింపుపై చ‌ర్చించారు.

                 ఆసుప‌త్రిలో కొత్త‌గా ఒక లైఫ్ స‌పోర్టు అంబులెన్స్ ఏర్పాటు, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం, నెఫ్రాల‌జీ విభాగంలో డ‌యాలసిస్ యూనిట్‌, దానికి అనుబంధంగా ఆర్ఓ ప్లాంటు, దిన‌స‌రి వేత‌నంపై ఇద్ద‌రు క్షుర‌కుల నియామ‌కం, జ‌న‌రిక్ మందుల‌షాపు ఏర్పాటు,  ఘోషాసుప‌త్రిలో ప‌లు భ‌వ‌నాల నిర్మాణం, 15 సిసి కెమేరాల ఏర్పాటుకు, రూ.20ల‌క్ష‌లు విలువైన డ‌యాథెర్మీ ప‌రిక‌రం ఏర్పాటు, వివిధ ధృవ‌ప‌త్రాల‌కు ఛార్జీల పెంపు, డేటా ఎంట్రీ అప‌రేట‌ర్ల నియామకం, మ‌రియు వేత‌నాల పెంపుపై చ‌ర్చించి ఆమోదించారు. ఎంఎల్ఏ అదితి విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ, ఆసుప‌త్రి అభివృద్దికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆసుప‌త్రిలో రోగుల‌కు వ‌స‌తి స‌రిపోవ‌డం లేద‌ని, అందువ‌ల్ల త‌క్ష‌ణ‌మే డిసిహెచ్ఎస్ కార్యాల‌యాన్ని త‌ర‌లించాల‌ని కోరారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించారు.

                  ఈ స‌మావేశంలో ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్, సొసూటీ మెంబ‌ర్ క‌న్వీన‌ర్‌ డాక్ట‌ర్ అల్లు ప‌ద్మ‌జ‌, సొసూటీ స‌భ్యులు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ బి.దేవి మాధ‌వి, ఇన్‌ఛార్జి డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ కె.రాణి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ ఎన్‌పి ప‌ద్మ‌శ్రీ‌రాణి, ఎపిఎంఎస్ఐడిసి ఈఈ ఎన్‌.భార‌తి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పి.న‌ల్ల‌న‌య్య‌, కోఆప్ష‌న్ స‌భ్యులు డాక్ట‌ర్ ఎం.జ‌య‌చంద్ర‌నాయుడు, డాక్ట‌ర్ వంకాయ‌ల అశోక్‌, ఇమ్మిడి సుధీర్‌, ఎస్‌.అనురాధాబేగం, ప‌లువురు డాక్ట‌ర్లు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

101225-C

101225-C

101225-D

101225-D