Close

అంబరాన్నంటిన అమ్మ సంబరం , వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం, లక్షలాదిగా తరలి వచ్చిన జనం

Publish Date : 17/10/2022

అంబరాన్నంటిన అమ్మ సంబరం

వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం

లక్షలాదిగా తరలి వచ్చిన జనం

విజ‌య‌న‌గ‌రం, అక్టోబర్ 11 ః ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి, విజ‌య‌న‌గ‌రం ఇల‌వేలుపు శ్రీ పైడితల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వం సంప్ర‌దాయ‌భ‌ద్దంగా, అత్యంత వైభవంగా జ‌రిగింది. ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్స‌వాన్ని మంగ‌ళ‌వారం జిల్లా యంత్రాంగం ప్ర‌శాంతంగా, ఘనంగా నిర్వ‌హించింది. ఎప్ప‌టిలాగే పాల‌ధార‌, అంజ‌లి ర‌థం, తెల్ల ఏనుగు, బెస్త‌వారి వ‌ల ముందు న‌డ‌వ‌గా, భక్తులు జేజేలు పలుకుతుండగా, పైడిత‌ల్లి అమ్మ‌వారు మూడుసార్లు విజ‌య‌న‌గ‌రం పుర‌వీధుల్లో సిరిమాను రూపంలో ఊరేగి, భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. బంటుపల్లి వెంకటరావు సిరిమాను ను అధిరోహించారు. పైడిమాంబ త‌న పుట్టినిల్లు విజ‌య‌న‌గ‌రం కోట‌వ‌ద్ద‌కు వెళ్లి, రాజ కుటుంబాన్ని ఆశీర్వ‌దించారు. ఈ అపూర్వ ఘ‌ట్టాన్ని ప్రత్యక్షంగా లక్షలాదిమంది ప్ర‌జ‌లు తిల‌కించి పర‌వ‌శించారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్యకుమారి మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో, క‌లిసిక‌ట్టుగా కృషి చేసి, అమ్మవారి ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేశాయి.

ఉత్స‌వానికి అమ్మ‌వారి సిరిమానును, ఇత‌ర ర‌థాల‌ను ముందుగానే ఆల‌యం వ‌ద్ద‌కు తీసుకురావ‌డంతో, సుమారు సాయంత్రం 5.20 గంటలకి సిరిమానోత్స‌వం ప్రారంభ‌మై మూడుసార్లు తిరిగిన అనంతం పూర్త‌య్యింది. రెండేళ్ల తరువాత, ఈ ఏడాది భ‌క్తుల‌ను ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు అనుమతి ఇవ్వడంతో, ఉత్సవాన్ని చూసేందుకు లక్షలాది గా తరలివచ్చారు. సిరిమాను తిరిగే మార్గంలో రోడ్ల‌కు ఇరువైపులా బారికేడ్ల‌ను ఏర్పాటు చేసి నియంత్రించారు. బారికేడ్ల‌ను ఆర్అండ్‌బి అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిప‌ల్ సిబ్బంది ప్ర‌త్యేక పారిశుధ్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, తాత్కాలిక మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేశారు. ఉచితంగా త్రాగునీటి స‌దుపాయం క‌ల్పించారు. వివిధ స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఉచితంగా త్రాగునీరు, ఆహార పదార్ధాలను పంపిణీ చేశాయి. జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎస్‌పి సిరిమానోత్స‌వాన్ని ఆద్యంత‌మూ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు.

జిల్లా క‌లెక్ట‌ర్ సూచ‌న‌ల‌ను అనుగుణంగా, డిఆర్వో ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ సూర్యకళ, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్.శ్రీరాములనాయుడు, ఇత‌ర అధికారులు, రెవెన్యూ, పోలీసు, మున్సిప‌ల్‌, ఆర్అండ్‌బి, పైడిమాంబ దేవ‌స్థానం, వైద్యారోగ్య‌శాఖ‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ‌, ట్రాన్స్‌కో త‌దిత‌ర‌ సుమారు 22 ప్ర‌భుత్వ శాఖ‌లకు చెందిన‌ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో కృషి చేసి, ఆల‌య సంప్ర‌దాయాల‌కు అనుగుణంగా ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. వీరిని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్యకుమారి ప్ర‌త్యేకంగా అభినందించారు. ఉత్సవాన్ని ప్రశాంతంగా పూర్తి చేసినందుకు ప్ర‌జ‌లంద‌రికీ క‌లెక్ట‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జిల్లా ఎస్‌పి దీపిక ఆధ్వ‌ర్యంలో పోలీసు శాఖ అందించిన సేవ‌లు ప్ర‌శంస‌ల‌ను అందుకున్నాయి. ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా, ఉత్స‌వాన్ని ప్ర‌శాంతంగా పూర్తిచేయ‌డంలో పోలీసులు కీల‌క పాత్ర వ‌హించారు.

సిరిమానోత్స‌వాన్ని తిల‌కించిన ప్ర‌ముఖులు

క‌న్నుల‌కింపైన పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వాన్నిప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌త్య‌క్షంగా తిల‌కించారు. జిల్లా కేంద్ర స‌హ‌కార బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కుటుంబం, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆశీనులై ఉత్స‌వాన్ని తిల‌కించారు. జెడ్పి ఛైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, సిరిమాను ముందుండి నడిపించారు.

మాన్సాస్ ఛైర్‌పర్స‌న్ అశోకగజపతి రాజు, ఇతర ఇత‌ర కుటుంబ స‌భ్యులు కోట బురుజు పైనుంచి సిరిమాను ఉత్స‌వాన్ని తిల‌కించి ప‌ర‌వ‌శించారు.

కిక్కిరిసిన విజ‌య‌నగ‌రం వీధులు

కోవిడ్ అనంత‌రం రెండేళ్ల త‌ర్వాత పూర్తిస్థాయిలో జరిగిన సిరిమాను వేడుక‌ను వీక్షించేందుకు, పైడితల్లిని ద‌ర్శించుకునేందుకు ఉత్త‌రాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేశారు. అన‌ధికారిక అంచ‌నాల ప్ర‌కారం సుమారు మూడు ల‌క్ష‌ల మంది భ‌క్తులు వేడుక‌కు హాజ‌ర‌య్యారు. న‌గ‌ర వీధుల‌న్నీ ఎటు చూసినా జ‌న సందోహంతో కిక్కిరిసిపోయాయి. సిరిమానును వీక్షించేందుకు కోట జంక్ష‌న్ వ‌ద్ద‌, అంబ‌టి స‌త్రం వైపు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ బాక్సులు కూడా పూర్తిగా నిండిపోయాయి. క‌రోనా నిబంధ‌న‌ల వంటివి లేకపోవ‌టంతో భ‌క్తులు వీధుల్లో స్వేచ్చ‌గా సంచ‌రించారు. సిరిమాను తిరిగే స‌మీపంలోకి భ‌క్తులు రాకుండా ఆల‌యం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే దారుల‌ను బారికేడ్ల‌తో ముందుగానే మూసివేశారు.

………..

అంబరాన్నంటిన అమ్మ సంబరం , వైభవంగా పైడిమాంబ సిరిమానోత్సవం, లక్షలాదిగా తరలి వచ్చిన జనం