అన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 10/12/2025
అన్ని కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 09: అన్ని అంశాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ అధికారులు 7 కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100% ప్రగతి సాధించేటట్లు చూడాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గర్భిణులకు బాలింతలకు పోషకాహారాన్ని అందించి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే తరచు అనారోగ్యం పాలవుతున్న పిల్లలను గుర్తించి పెరుగుదల తగ్గిపోకుండా చూడాలని, స్టంటేడ్, అండర్ వెయిట్ పిల్లలు ఉండకుండా చూడాలని సూచించారు. తక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న మండలాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా అదుపు చేయాలని కోరారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, టాయిలెట్స్, తాగునీరు లేని అంగన్వాడీలు లేకుండా చూడాలని ఆదేశించారు.
మిషన్ వాత్సల్య పథకం అమలులో భాగంగా రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమీక్ష, జిల్లా మరియు గ్రామస్థాయి శిశు సంక్షేమ మరియు పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలన్న నిబంధనల మేరకు బాలల హక్కుల పరిరక్షణ కోసం బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఈ పథకం క్రింద అనాధ పిల్లలను గుర్తించి చైల్డ్ కేర్ సెంటర్ లకు తరలించడం జరుగుతుందన్నారు.
వన్ స్టాప్ సెంటర్ (One Stop Centre – OSC) ప్రధాన ఉద్దేశ్యం హింసకు గురైన మహిళలకు తక్షణ సహాయం అందించడం, ఇందులో వైద్యం, న్యాయం, పోలీస్ సహాయం, కౌన్సెలింగ్, మరియు తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట సమగ్రంగా అందుబాటులో ఉంచడం, దీని ద్వారా వారు సురక్షితంగా, గౌరవంగా తమ సమస్యల నుండి బయటపడటానికి సహాయపడటమని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి ఐదు రోజులు వసతి కల్పిస్తామని తెలియజేశారు.
ముందుగా మహిళా శిశు సంక్షేమ అధికారి టి.విమల రాణి మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న 201 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని అంగన్వాడీల్లో 7104 గర్భిణులు,7177 బాలింతలు ఉన్నారని వారికి పోషకాహారం అందిస్తున్నామని అలాగే పిల్లలకు బాలామృతం, గుడ్లు పాలు అందిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ సమావేశంలో డీఈవో యు.మాణిక్యం నాయుడు, సిడిపిఓలు, సూపర్వైజర్లు ఆర్డీవోలు పాల్గొన్నారు.
……….
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం .