Close

ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ బంగారమే..!!* – భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ – ఢిల్లీ నుండి భోగాపురం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం. – అదే విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. – అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కు స్వాగతం అన్న మ

Publish Date : 06/01/2026

*ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ బంగారమే..!!*

– భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్
– ఢిల్లీ నుండి భోగాపురం చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం.
– అదే విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
– అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం కు స్వాగతం అన్న మాట చాలా ప్రత్యకంగా అనిపించింది అన్న రామ్మోహన్ నాయుడు.
జనవరి 04 : ఉత్తరాంధ్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలచే రోజుగా జనవరి 04, 2026 ఖ్యాతినార్జించింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వ్యాలిడేషన్ కమర్షియల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా.. ఉత్తరాంధ్ర వాసుల ఆశలను మోసుకుంటూ ఘనంగా ల్యాండ్ అయింది. ఈ ప్రత్యేక వేడుక చూడటానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు అందరూ భోగాపురం బాట పట్టారు.
 జనవరి మూడవ తేది శనివారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ పర్యటన కోసం శనివారం రాత్రే డిల్లి చేరుకున్నారు. చరిత్రలో చిరస్థాయి గా నిలచే రోజు కోసం ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా కమర్షియల్ ఫ్లైట్ లో ఉదయం 8:45 బయలుదేరింది.
*అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టుకు మీకు స్వాగతం…!!*
 ఉత్తరాంధ్ర వాసుల ఉద్విగ్న క్షణాలకు మోసుకువస్తున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. సరిగ్గా 11:01 నిమిషాలకు భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అంతకుముందు భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే సమయంలో “అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టుకు మీకు స్వాగతం అన్న క్యాబిన్ క్రూ మాటలు వినగానే ఎంతో ఆనందం అనిపించిందని, ఈ మాట కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశా” అని.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వాఖ్యానించారు.
రామ్మోహన్ నాయుడు వ్యాలిడేషన్ ఫ్లైట్ నుండి దిగగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఆత్మీయ స్వాగతన్ని పలికారు. శరవేగంగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు జరిగేలా చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ తో ఫోటోలు దిగారు. చారిత్రాత్మక ఘట్టానికి ఈరోజు గుర్తుగా నిలుస్తుందని అక్కడివారు వాఖ్యానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన వేదిక వద్ద నుండి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన తొలి వ్యాలిడేషన్ ల్యాండింగ్ సక్రమంగా జరిగిందని తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు భీజం వేసింది విజనరీ లీడర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కితాబిచ్చారు. కనెక్టివిటి ద్వారా అభివృద్ధి అని నమ్మే చంద్రబాబు నాయుడు.. 2016 లో పూసపాటి అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రిన్సిపల్ అప్రూవల్ చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారడం, ఇతర కారణాలు, ఇబ్బందులు వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైందని, మళ్ళీ తాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా భాధ్యతలు తీసుకున్న తరువాత దేవుడు నాకిచ్చిన అవకాశంగా భావించి.. పద్దెనిమిది నెలల్లో, ప్రతీ నెలలో ప్రత్యేక సమీక్షలు చేస్తూ తుది దశకు తీసుకువచ్చానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తుది దశకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సందర్భంలో మొదటగా డిసెంబర్ 2026 గా సూచిస్తే.. అందుకు ఆయన ఒప్పుకోలేదని గుర్తు చేశారు. ఆరు నెలల ముందే ఇది పూర్తి చెయ్యాలని ఆయన డేడ్ లైన్ విధించారని అన్నారు. ఆయన మాటను మార్గదర్శకంగా తీసుకుని అంతకన్నా ముందే ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో కీలకంగా ఉన్న జి.ఎం.ఆర్ సంస్థను అయన ప్రత్యేకంగా అభినందించారు. జీఎమ్మార్ గారి సొంత ప్రాంతం కావడంతో మరింత ప్రత్యేక చొరవతో నిర్మాణం జరిగినట్టు గుర్తు చేశారు. దానికి తోడు ఎల్ అండ్ టి సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిజిసిఏ.. ఇలా అన్ని వ్యవస్థలు సరైన సమన్వయం చేసుకుని త్వరితగతిన నిర్మాణం జరిగేలా చొరవ చూపారని గుర్తు చేశారు.
*స్థానిక రైతాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు..!!*
 ఈ వేదికపై భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పురోగతిని వివరిస్తున్న సమయంలోనే స్థానిక రైతుల త్యాగాన్ని కూడా రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భూమి త్యాగం చేసిన రైతాంగం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అని రామ్మోహన్ నాయుడు అన్నారు. వారి త్యాగం వల్లే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ రూపొందిందని, వారి త్యాగం వృధా చెయ్యకుండా వరల్డ్ క్లాస్ సిటిగా తయారుచేస్తా అని హామీ ఇచ్చారు.
*చంద్రబాబు ఆలోచనను అనుమానించారు..?*
 అభివృద్ధి విషయంలో ఎప్పుడు తన స్పష్టమైన విజన్ ను చూపే చంద్రబాబు ఆలోచనను.. ఓర్వలేని వారు ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్ లో శంషాబాద్ విమాశ్రయం విషయంలో అనేక విమర్శలు చేశారని, వారందరూ ఇప్పుడు ఎక్కడైనా గజం భూమి దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అదే పరిస్థితి ఇప్పుడు భోగాపురం లో కూడా ఎదురుకానుందని, మన ప్రాంత వాసులు ఇప్పుడు అదే ఫలాలను పొందనున్నారని స్పష్టం చేశారు.
*కనెక్టివిటి తోనే అభివృద్ధి..!!*
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అందుకు కనెక్టివిటి ప్రధాన భూమిక పోషిస్తుందని, భోగాపురం తో అంతర్జాతీయ బంధాలు ఈ ప్రాంతంతో బలపడతాయని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. ఉపాధి, వ్యవసాయం, రవాణా, పర్యాటకం.. ఇలా అన్ని రంగాలు వృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు.
*ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం*
ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి సరైన దిశా నిర్దేశంతో సహకారం అందించిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే మరొక నాలుగైదు నెలల్లో ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ అంటే కీలక పనులు పూర్తయ్యాయి అని తెలపడానికి సంకేతం అని అన్న రామ్మోహన్ నాయుడు.. సవాలక్ష చెక్ లిస్టులను ఇప్పటికే పూర్తి చేసుకున్నామని అన్నారు.
*ఉత్తరాంధ్ర అనందపడుతోంది..!!*
భోగాపురం విమానాశ్రయం ఒక్క విజయనగరం జిల్లాకే పరిమితం కాలేదని, తాను ఉత్తరాంధ్ర, ఒరిస్సా, రాయ్ పూర్ ఇలా ఎక్కడ పరిధిలో పర్యటిస్తున్నా అక్కడి ప్రజలు ఈ బృహత్తర ప్రాజెక్ట్ పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు.
*ఉద్విఘ్న క్షణం ఇది..!!*
ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ లు ప్రారంభం అవుతాయి కాని.. ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియదు అనేది చాలామందిలో ఉన్న భావన అని.. వాటికి ముగింపు పలుకుతూ సమగ్రంగా అభివృద్ధి చెందిన ప్రాజెక్ట్ భోగాపురం విమానాశ్రయం ను త్వరలోనే ప్రారంభించడం.. ఉద్విఘ్న క్షణంగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని, ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ధి చెందనుందని అన్నారు.
*యువత వినియోగించుకోవాలి..!!*
రాబోయే ఉపాధి అవకాశాలను యువత వినియోగించుకోవాలని రామ్మోహన్ నాయుడు కోరారు. సంబంధిత రంగాల్లో నైపుణ్యాన్ని పెంచుకుంటే.. సమీప భవిష్యత్ లో ఉపాధి విప్లవంలో మంచి అవకాశాలు సాధించే వీలుందని గుర్తు చేశారు. అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయని, ఎంపిక మీ చేతుల్లో ఉందని గుర్తు చేశారు.
విమానయానంలో కీలకంగా ఉండే ఎం.ఆర్.వో (మెంటేనేన్స్, రిపేర్, ఆపరేషన్స్) కోసం భోగాపురం లోనే అయిదు వందల ఎకరాలు కేటాయించడం జరిగిందని, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎడ్యు సిటి అందుబాటులో ఉండనుందని తెలిపారు. వేల కోట్ల ఆస్తిని యువత కోసం ఇచ్చిన పూసపాటి అశోక్ గజపతి రాజు, అదితి గజపతిరాజు లకు ధన్యవాదాలు తెలిపారు.
ఉత్తరాంధ్ర కల సాకారం కానున్న శుభ తరుణంలో.. ఈ బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడెక్కడి నుండో వచ్చి సరైన సమయానికి పూర్తి చెయ్యాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఎండనక, వాననక కష్టించి, శ్రమించి నిర్మించిన కార్మికులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరిగి అదే విమానంలో డిల్లీ చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, జి.ఎం.ఆర్ అధికారులు, కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
060126-A

060126-A

060126-B

060126-B

060126-C

060126-C

060126-D

060126-D

060126-E

060126-E