Close

ఉత్సాహంగా ‘రైతన్న మీకోసం,’ 1,45,000 వేల రైతు కుటుంబాల విశ్లేష‌ణ‌

Publish Date : 27/11/2025

ఉత్సాహంగా ‘రైతన్న మీకోసం’

1,45,000 వేల రైతు కుటుంబాల విశ్లేష‌ణ‌

విజయనగరం, న‌వంబ‌రు 26 :  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం  జిల్లాలో ఉత్సాహంగా జ‌రుగుతోంది. వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 24 న ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్ర‌మాన్ని వారోత్సవాలుగా ఈ నెల 29 వ‌ర‌కు నిర్వహించనున్నారు.

ముఖ్య లక్ష్యాలు – పురోగతి

లక్ష్యం: జిల్లాలోని మొత్తం 27 మండలాలు మరియు 363 రైతు సేవా కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రగతి: లక్ష్యంగా నిర్ణయించిన 2,27,700 మంది రైతు కుటుంబాలలో, ఇప్పటి వరకు 1,45,000 వేల మంది రైతుల కుటుంబాలను విశ్లేషించారు.

సమాచార సేకరణ:  పంట పరిస్థితులు, భూమి స్వరూపం, సాగు విధానాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటి అవసరాలపై రైతుల నుండి నేరుగా సమాచారం సేకరించడం జరుగుతోంది.

ముఖ్య ఉద్దేశ్యం: రైతుల సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోవడం, వారిని ఆదాయం పెంచుకునే దిశగా మార్గనిర్దేశం చేయడమే ఈ క్యాంపైన్ ప్రధాన లక్ష్యం.

రైతుల సుభిక్షానికి కొత్త దారులు ః

ఈ కార్యక్రమం ద్వారా రైతులకు, ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు మధ్య సమన్వయం మరింత బలపడింది.

లాభాలు: రైతుల ఆదాయం పెంచడానికి, శాస్త్రీయ సాగు పద్ధతులను గ్రామస్థాయిలో విస్తరించడానికి ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.

భవిష్యత్ ప్రణాళిక: రాబోయే పంట సీజన్లకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికలు మరియు పంట రకాలకు సంబంధించిన ముందస్తు అనుసంధాన చర్యలకు ఇది దోహదం చేస్తుంది. రైతుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా యంత్రాలపై సబ్సిడీలు, పంట ప్రోత్సాహక పథకాలు, ఆధునిక సాగు విధానాల అమలు, మరియు అధిక దిగుబడి – తక్కువ ఖర్చుతో సాగు సాధించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికలను అమలు చేయనుంది. వ్యవసాయాన్ని లాభదాయక రంగంగా మార్చడానికి లక్ష్య ఆధారిత ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ సమాచారం ఉపయోగకరమని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామాల్లో పర్యటన: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు నేరుగా రైతుల ఇళ్లకు, పొలాలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.

పంచ సూత్రాలపై అవగాహన: ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయంలో ‘పంచ సూత్రాలు’ (నీటి భద్రత, డిమాండ్‌ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, నిరంతర ప్రభుత్వ సహకారం) అమలు ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తారు.

సమస్యల పరిష్కారం: రాయితీలు, పంట బీమా, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి), సాగునీరు, మార్కెటింగ్ సమస్యల గురించి సమాచారం సేకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు.

కార్యచరణ ప్రణాళిక: డిసెంబర్ 3న ప్రతి రైతు సేవా కేంద్రంలో గ్రామసభలు నిర్వహించి, 2026-27 సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి  గైర్హాజ‌రైన 114 మంది సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

………………………………

స‌ద్వినియోగం చేసుకోవాలి ః క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి

           జిల్లాలోని రైతులందరూ “రైతన్నా – మీ కోసం” కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి కోరారు. వ్యవసాయం ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెంచ‌డం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రైతు సుభిక్షం అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి రైతు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.