Close

ఉద్యాన పంట‌ల‌ విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక‌ కార్యాచ‌ర‌ణ‌* *అద‌నంగా 10వేల ఎక‌రాల్లో సాగుకు ప్రణాళిక‌* *ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అమ‌లు* *జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న కార్య‌క్ర‌మం

Publish Date : 26/12/2025

ఉద్యాన పంట‌ల‌ విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక‌ కార్యాచ‌ర‌ణ‌*
*అద‌నంగా 10వేల ఎక‌రాల్లో సాగుకు  ప్రణాళిక‌*
*ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అమ‌లు*
*జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న కార్య‌క్ర‌మం*
విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 24 ః
                   జిల్లాలో ఉద్యాన‌సాగు విస్త‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందింది. జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వినూత్న ఆలోచ‌న‌తో త్వ‌ర‌లోనే అద‌నంగా జిల్లాలో సుమారు ప‌దివేల ఎక‌రాల్లో ఉద్యాన పంట‌ల సాగు మొద‌లు కానుంది. దీనికోసం వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో, స‌మ‌ష్టిగా అమ‌లుకు రంగం సిద్ద‌మ‌య్యింది. డిఆర్‌డిఏ నోడ‌ల్ ఏజెన్సీగా, వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌, సూక్ష్మ సేద్యం, విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల‌తో క‌న్వ‌ర్జెన్సీ స‌మావేశాన్ని క‌లెక్ట‌రేట్‌లో బుధ‌వారం నిర్వ‌హించి, ఈ కార్య‌క్ర‌మం అమ‌లుకు జిల్లా కలెక్టర్  దిశానిర్ధేశం చేశారు.
*కార్య‌క్ర‌మం లక్ష్యం*
                  వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటి చేయాల‌న్న ఉద్దేశ్యంతో సంప్ర‌దాయ పంట‌ల‌కు బ‌దులు ఉద్యాన పంట‌ల‌ను సాగు చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రాబాబునాయుడు ఆదేశాల‌కు అనుగుణంగా జిల్లా క‌లెక్ట‌ర్ ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా ప్ర‌స్తుత ర‌బీ సీజ‌న్‌లో 4వేల ఎక‌రాలు, ఖ‌రీఫ్‌లో 6 వేల ఎక‌రాలు, మొత్తంగా 10వేల ఎక‌రాల్లో అద‌నంగా వివిధ ఉద్యాన పంట‌ల సాగు చేప‌డ‌తారు. దీనిలో సేంద్రీయ పంట‌ల సాగుకు ఎక్కువ‌ ప్రాధాన్య‌త ఇస్తారు. కూర‌గాయలు, ఆకుకూర‌లతోపాటు ఆయిల్ పాం లాంటి పంట‌ల‌తోపాటు, మున‌గ పంట సాగును ప్రోత్స‌హించ‌నున్నారు.
*మార్గ‌ద‌ర్శిల ఎంపిక‌*
                   సంప్ర‌దాయ పంట‌లు బ‌దులు ఉద్యాన పంట‌ల‌వైపు మళ్లేందుకు ఆస‌క్తి ఉన్న ఉత్సాహ‌వంతులైన‌ రైతుల‌ను ఎంపిక చేసి, వారి పంట పొలాల‌తో ఐఎఫ్‌సి (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌ క్ల‌ష్ట‌ర్లు)గా ఏర్పాటు చేస్తారు. వీరిలో ప్ర‌తీ గ్రామం నుంచి ఒక రైతును మార్గ‌ద‌ర్శిగా ఎంపిక చేస్తారు. వీరి ద్వారా సాటి రైతుల‌ను ప్రేరేపిస్తారు. వీరిని ప్రోత్స‌హించే ఉద్దేశ్యంతో మండ‌లానికి ఉత్త‌మ మార్గ‌ద‌ర్శిని ఎంపిక చేసి స‌త్క‌రిస్తారు. మార్గ‌ద‌ర్శిల‌ను ఎంపిక చేసే బాధ్య‌త‌ను ఉద్యాన శాఖ అధికారుల సూచ‌న‌ల మేర‌కు ఆ గ్రామంలోని వ్య‌వ‌సాయ‌, ఉద్యాన స‌హాయ‌కులు, డిఆర్‌డిఏ ఆర్‌పిలు, ఎపిఎంలు, సిసిలుతో కూడిన బృందాలు చేప‌డ‌తాయి.
*మార్కెట్ గ్యారెంటీ*
                   పండించిన పంట‌కు స‌రైన మార్కెట్ ఉన్న‌ప్పుడే పండించేందుకు రైతులు ముందుకు వ‌స్తారు. దీనికోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు సాగు చేసే క్ల‌ష్ట‌ర్‌ను, దాని ప‌రిధిలోని పాఠ‌శాల క్ల‌ష్ట‌ర్‌కు అనుసంధానం చేస్తారు. ఇక్క‌డ పండించే పంట‌లు, అక్క‌డి స్మార్ట్ కిచెన్‌కు స‌ర‌ఫ‌రా చేస్తారు. త్వ‌ర‌లో పాఠ‌శాల‌ల్లోని మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని స‌ర‌ఫ‌రా చేసేందుకు విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి కూర‌గాయాల‌ను స‌ర‌ఫ‌రా చేసే విధంగా ఒప్పందం కుదురుస్తారు. అలాగే మిగిలిన పంట‌ల‌ను రైతు బ‌జార్ల‌లో విక్ర‌యిస్తారు. విశాఖ‌ప‌ట్నం లాంటి పెద్ద న‌గ‌రాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని యోచిస్తున్నారు. అదేవిధంగా ప్ర‌త్యేక బ్రాండ్ పేరుతో సేంద్రీయ పంట‌ల‌ను విక్ర‌యించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. మున‌గాకు పొడికి విదేశాల్లో సైతం ఎంతో డిమాండ్ ఉండటంతో, మున‌గ సాగును ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించారు.
*రైతుల ఎంపిక ఇలా*
                  ఉద్యాన పంట‌ల సాగుకు నీరు ఎక్కువ అవ‌స‌రం ఉంటుంది. దీంతో వినూత్న కార్యార‌చ‌ణ‌ను అమ‌లు చేసేందుకు  వ్య‌వ‌సాయ బోర్లు ఉన్న రైతుల‌ను మొద‌ట ఎంపిక చేస్తారు. త‌రువాత త‌మ పొలానికి సుమారు 180 మీట‌ర్ల దూరంలోపు  విద్యుత్ సౌక‌ర్యం ఉన్న రైతుల‌కు ద్వితీయ ప్రాధాన్య‌త ఇస్తారు. ఆ చుట్టుప్ర‌క్క‌ల రైతుల‌ను కూడా ఎంపిక చేసి క్ల‌ష్ట‌ర్ గా రూపొందిస్తారు. ద‌శ‌ల‌వారీగా ఇత‌ర పొలాల‌కు సాగును విస్త‌రించి, జిల్లాలో చిన్న‌చిన్న క‌మ‌తాలే ఎక్కువ‌గా ఉన్నందువ‌ల్ల‌, స‌మష్టి వ్య‌వ‌సాయం దిశ‌గా అడుగులు వేయిస్తారు. బోర్లు తవ్వేందుకు, మోటార్లు బిగించేందుకు, ఇత‌ర వ్య‌వ‌సాయ ప‌రిక‌రాలు కొనుగోలు, డ్రిప్ ఏర్పాటుకు డిఆర్‌డిఏ, ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారు రుణ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేస్తారు.
*15 రోజుల్లో మార్గ‌ద‌ర్శుల ఎంపిక పూర్తి చేయాలి ః*
*జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి*
                  ఉద్యాన పంట‌ల సాగు పెంచే ల‌క్ష్యంతో అమ‌లు చేయ‌నున్న ఈ వినూత్న కార్య‌క్ర‌మంలో కీల‌క పాత్ర పోషించే మార్గ‌ద‌ర్శుల ఎంపిక‌ను 15 రోజుల్లో పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖ‌ల అధికారుల‌తో బుధ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఉత్సాహ‌వంతులైన రైతుల‌ను మార్గ‌ద‌ర్శులుగా ఎంపిక చేయాల‌ని సూచించారు. అలాగే కార్య‌క్ర‌మం అమ‌లు చేయ‌డానికి మండ‌ల స్థాయి అధికారుల‌తో ఈ నెలాఖ‌రున ఒక ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.
                   ఈ కార్య‌క్ర‌మం అమ‌లు కోసం రూపొందించిన పిపిటిని డిఆర్‌డిఏ శ్రీ‌నివాస్ పాణి ప్ర‌ద‌ర్శించారు. స‌మావేశంలో వ్య‌వ‌సాయ‌శాఖ జెడి విటి రామారావు, ఉద్యాన‌శాఖ డిడి చిట్టిబాబు, ఏపిఎంఐపి పిడి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ ఎం.ల‌క్ష్మ‌ణ‌రావు, ఉద్యాన‌శాఖ అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………..
జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.
261225-A

261225-A