* Everyone should know the importance of voting * Collector Suryakumari at the awareness session organized at JNTU
Publish Date : 08/10/2021
పత్రికా ప్రకటన-2
*ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి*
*జేఎన్‌టీయూలో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి
*జ్ఞాన సముపార్జనకు సోషల్ మీడియా అడ్డంకిగా మారిందని వ్యాఖ్య
విజయనగరం, అక్టోబర్ 07 ః రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటు ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే అందరికీ ఓటు గుర్తు రావటం శోచనీయమని, ముందుగానే ఓటరు జాబితా చూసుకోవాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందని గుర్తు చేశారు. స్థానిక జేఎన్‌టీయూలో గురువారం నిర్వహించిన స్వీప్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు నమోదు చేయించుకోవాలని, దాన్ని ప్రాథమిక బాధ్యతగా అందరూ భావించాలని పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది ఎన్నికల సమయంలో వినియోగించుకొనే సాధనం కాదని, అది రాజ్యాంగం మనకు కల్పించిన ప్రత్యేక హక్కు అని గుర్తు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. రాజకీయ, సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
*సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది*
నేటి తరం విద్యార్థుల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఉందని, అది జ్ఞాన సముపార్జనకు అడ్డంకిగా మారిందని కలెక్టర్ అన్నారు. నిర్ధారణ కాని ఎన్నో అంశాలు తప్పుడు సమాచారంగా మారి అందరినీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాజకీయాల్లోకి, సివిల్ సర్వీసెస్‌లోకి ప్రవేశించాలంటే ఏం చేయాలని కొంత మంది విద్యార్థులు అడగగా… దేనీకి షార్ట్‌కట్ లేదని.. కష్టపడి చదవటం.. ఆశాభావంతో ప్రయత్నించటమే మార్గమని కలెక్టర్ బదులిచ్చారు. మనసు పెట్టి చదవాలని చెప్పారు. యుక్త వయస్సులోనే దేన్నైనా సులభంగా నేర్చుకోగలమని ఇప్పుడే దృష్టి సారించి శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, గురువు ప్రసన్నం చాలా ముఖ్యమని అవి లేకుండా ముందుకెళ్లినా విజయం చేకూరదని ఉద్భోద చేశారు. లక్ష్య సాధనలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతాయని వాటిని ఎదుర్కొని ముందుకెళ్లాలని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి ఓటు నమోదుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఓటు హక్కు రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో జేసీ జె. వెంకటరావు, ఎస్‌డీసీ పద్మావతి, జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్ స్వామినాయుడు, విజయనగరం తహశీల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు, జేఎన్‌టీయూ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————–
జారీ, సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.