Close

గిరిజన విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా, సమూల మార్పులకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు, HPTS యాప్ ద్వారా ప్రతిరోజు పర్యవేక్షణ– గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు

Publish Date : 28/11/2025

గిరిజన విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘా

సమూల మార్పులకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు

HPTS యాప్ ద్వారా ప్రతిరోజు పర్యవేక్షణ

— గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు

విజయనగరం, నవంబర్ 27:  జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం 8 ఆశ్రమ పాఠశాలలు, 10 కాలేజీ హాస్టళ్లు పనిచేస్తున్నాయనీ, గిరిజన విద్యా సంస్థల పనితీరును మరింత మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందనీ గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక అధికారి కె. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా తాజా సాంకేతిక విజ్ఞానంతో రూపొందిన HPTS (Hostel Performance Tracking System) యాప్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు.

ఈ యాప్ ద్వారా హాస్టల్ నిర్వహణలో ప్రతిరోజూ జరిగే పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వంట పాత్రల శుభ్రత, ఆహార నాణ్యత, క్లాస్ రూంలు, డార్మెటరీలు, టాయిలెట్లు, బాత్రూముల పరిస్థితి, ఓవర్ హెడ్ ట్యాంకులు, మినరల్ వాటర్ ప్లాంట్ల పనితీరు వంటి అంశాల ఫోటోలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.

అలాగే సికిల్ సెల్ అనీమియా, టీబీ, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న విద్యార్థుల వివరాలు, ప్రతి విద్యార్థి బ్లడ్ గ్రూప్ వంటి సమాచారాన్ని కూడా యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుందనీ,  రూఫ్ లీకేజీలు, మరమ్మత్తులు అవసరమైన ప్రాంతాలు వంటి భౌతిక సదుపాయాల సమస్యలను కూడా HMలు, వార్డెన్లు నియమిత గడువుల ప్రకారం (Daily/Weekly/Monthly) అప్లోడ్ చేయాలన్నారు.

యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ATWO, DSTWEO, Director of Tribal Welfare తదితర ఉన్నతాధికారులు డాష్‌బోర్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. దీంతో గ్రౌండ్‌ లెవెల్ పరిస్థితులను వెంటనే తెలుసుకొని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే అవకాశం లభిస్తుందన్నారు.

HPTS యాప్ అమలు వల్ల విద్యార్థుల భద్రత, మెనూ ప్రకారం భోజనం, పరిశుభ్రత, వైద్య శ్రద్ధ వంటి అంశాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

=========

జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం