జిల్లా అభివృద్దికి కృషి చేయండిఉపాధిహామీ నిధులను పూర్తిగా వినియోగించుకోవాలిసహజ ప్రసవాలు జరిగే విధంగా చూడండిరాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వర్రావువివిధ శాఖల అధికారులతో సమీక్షసేంద్రీయ పంటల ప్రతిపాదనపై డిఆర్‌డిఏకి అభినందనలు
Publish Date : 28/11/2025
జిల్లా అభివృద్దికి కృషి చేయండి
ఉపాధిహామీ నిధులను పూర్తిగా వినియోగించుకోవాలి
సహజ ప్రసవాలు జరిగే విధంగా చూడండి
రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వర్రావు
వివిధ శాఖల అధికారులతో సమీక్ష
సేంద్రీయ పంటల ప్రతిపాదనపై డిఆర్‌డిఏకి అభినందనలు
విజయనగరం, నవంబరు 27 ః
అధికారులంతా జిల్లా అభివృద్దికి తమవంతు కృషి చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మెన్ వి.జోగేశ్వర్రావు కోరారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లా ఎంతో అభివృద్ది చెందిందని, దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఛైర్మన్ జోగేశ్వర్రావుతో పాటు కమిటీ సభ్యులు నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు, వరుదు కల్యాణి గురువారం జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో వివిధ శాఖలకు మంజూరైన నిధులు, వినియోగం, అవసరాలపై సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యానశాఖ, పశు సంవర్ధకశాఖ, మైక్రో ఇరిగేషన్, నీటిపారుదల, వైద్యారోగ్యం, విద్య, త్రాగునీరు, పంచాయితీరాజ్, జిల్లా పరిషత్, పబ్లిక్ హెల్త్, ఆర్ అండ్ బి, డిఆర్‌డిఏ, స్త్రీశిశు సంక్షేమం తదితర శాఖలపై చర్చించారు. మహిళా పొదుపు సంఘాల అధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించి మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయడానికి డిఆర్‌డిఏ చేసిన ప్రణాళికను అభినందించారు. ఈ ప్రణాళికను రాష్ట్రమంతా అమలు చేయడానికి కృషి చేస్తామని చైర్మన్ ప్రకటించారు. జిల్లాలో మహాళా అక్షరాస్యత తక్కువగా ఉందని, దీనిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. వరి ఉత్పాధకత పెంచాలని సబ్సిడీపై రెయిన్ గన్‌లను అందజేసేందుకు ప్రతిపాదన చేయాలని సూచించారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని, సిజేరియన్లను తగ్గించాలని చెప్పారు.
గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో పాఠశాలల ప్రహరీ గోడలు, లింకు రోడ్లు, సిమ్మెంటు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఛైర్మన్ కోరారు. నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని, మురిగిపోకుండా చూడాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ భవనాలను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలన్నారు. చాలాచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు శిథిలావస్థలోను, అద్దె భవనాల్లోను ఉన్నాయని, సమీపంలో ఖాళీగా ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని సూచించారు.
కమిటీ సభ్యులు, ఎంఎల్ఏ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ చాలాచోట్ల పశువైద్యశాలలు శిధిలావస్థకు చేరాయని చెప్పారు. ఉపాధిహామీ ద్వారా పాఠశాలల ప్రహరీగోడలు నిర్మించాలని సూచించారు.
ఎంఎల్ఏ మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ విద్యాప్రమాణాలను పెంచేందుకు మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో ఎన్నో సంస్కరణలను అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలల్లో చేరికలు పెరిగాయని చెప్పారు. మధ్యాహ్నభోజన పథకం నాణ్యత పెరిగిందని, పోషకాహార పదార్ధాలు అందుతున్నాయని అన్నారు.
ఎంఎల్‌సి డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
ఎంఎల్‌సి వరుదు కల్యాణి మాట్లాడుతూ వర్షాలవల్ల వరిపంట కొంతమేర దెబ్బతిన్నదని, నూకలు ఎక్కువగా వస్తుండటం వల్ల, ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు రైతు నష్టపోకుండా చూడాలని కోరారు.
కమిటీ డిప్యుటీ కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా అధికారిణులు ఎక్కువగా ఉన్నప్పటికీ సమర్ధవంతంగా పరిచేస్తున్నారని చెప్పారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం విషయంలో డిఆర్‌డిఏ పిడిని ప్రత్యేకంగా అభినందించారు.
ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధుమాధవన్ ఛైర్మన్‌కు వివరించారు. జిల్లాలో ఆయిల్ పాం వృద్దికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సిపిఓ పి.బాలాజీ, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

2811-A