తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రత్యేకాధికారి రవి పట్టం శెట్టి, జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
Publish Date : 29/10/2025
తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్:
ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తక్షణమే తరలించాలి.
బలహీనంగా ఉన్న చెరువుల వద్ద సిబ్బంది, సామగ్రి తో పొజిషన్ లో ఉండాలి
తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రత్యేకాధికారి రవి పట్టం శెట్టి , జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి
విజయనగరం, అక్టోబరు 28: ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారిని తక్షణమే తరలించాలని జిల్లా స్పెషలాఫీసర్ రవి సుభాష్ పట్టం శెట్టి ఆదేశించారు. వృద్ధులను, పాత ఇళ్లు, పాడు పడిన ఇళ్లల్లో ఉన్నవారిని, పాకల్లో ఉన్న వారిని తప్పకుండా పునరావాస శిబిరాలకు చేర్చాలని తెలిపారు. అదే విధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారి బంధువుల ఇళ్లకు వెళతామని చెప్పేవారిని వారి బంధువుల ఇళ్ల వద్దకే సురక్షితంగా చేర్చాలని ఆదేశించారు.
తుఫాన్ చర్యల పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేకాధికారి రవి పట్టం శెట్టి , జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి మంగళవారం ఉదయం అధికారులతో సమీక్షించారు. గర్భిణీలను గుర్తించి వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని, నెలలు నిండిన వారిని సమీప పి హెచ్ సి లేదా సి హెచ్ సి ల్లో చేర్పించాలని, వారికి అవసరమగు మందులు ఆహారాన్ని అందించాలని తెలిపారు. తప్పుడు వార్తలను, వదంతులను వ్యాపించకుండా, ప్రజల్లో లేని పోనీ అనుమానాలు రేకెత్తకుండా రెవిన్యూ అధికారులు చూడాలని తెలిపారు. అవసరం అనుకున్నవారినే పునరావాస శిబిరాలకు తరలించాలని తెలిపారు. శిబిరాల్లో చేర్చిన వారికి ఆహారం , తాగు నీరు,ఇతర అవసరాలను సమకూర్చాల ని అన్నారు.
చెరువుల్లో చేరే ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో పై దృష్టి సారించాలని, గండ్లు పడితే ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇసుక బస్తాలు, వాహనాలు, సిబ్బంది బలహీనంగా ఉన్న చెరువుల వద్ద అవసరమగు సామగ్రి తో పొజిషన్ లో ఉండాలని, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవిన్యూ అధికారులు కూడా ఉండాలని తెలిపారు. విద్యుత్ అధికారులు తన సామగ్రి తో సిద్ధంగా ఉండాలని, ఆర్ అండ్ బి అధికారులు ఎక్కడెక్కడ ముప్పు ఉందొ గుర్తించి ఆ ప్రాంతాల్లో వారి సామగ్రి తో సిబ్బంది తో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రమాదం సంభవిస్తే తప్పించు కునే అవకాశం ఉండేలా పశువులను కట్టకుండా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. తాగు నీరు కలుషితం కాకుండా క్లోరిన్ కలిపిన నీటిని సరఫరా చేయాలని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్.డబ్ల్యు,ఎస్ ఎస్.ఈ కి డి.పి.ఓ కు సూచించారు. అత్యవసర మందులు, అత్యవసర వాహనాల తో సిద్ధంగా ఉండాలని డి ఎం హెచ్ ఓ కు ఆదేశించారు.
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్.పి ఏ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని, అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం

2910-D