*Provide better medical care to the people * District Collector A. Suryakumari in a review with medical officers
Publish Date : 08/10/2021
పత్రికా ప్రకటన
*ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి*
*వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని డీసీహెచ్ఎస్‌కు సూచన
విజయనగరం, అక్టోబర్ 06 ః వైద్యులు విధుల నిర్వహణలో అంకితభావం ప్రదర్శించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులతో ఆసుపత్రి సిబ్బంది సఖ్యతగా వ్యవహరించేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోగులతో ప్రేమగా మాట్లాడి వారిలో మనో ధైర్యం నింపాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని గుర్తు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్న సేవలపై సమీక్షించే నిమిత్తం కలెక్టరేట్ మీటింగ్ హాలులో బుధవారం ఆమె వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యం ఎక్కువగా ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడి ఉంటారని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రాథమిక కర్తవ్యాన్ని విధిగా నిర్వర్తించాలని హితవు పలికారు. చాలా చోట్ల వైద్య పరమైన సేవలు సరిగా అందటం లేదని, వైద్యులు సమయానికి రావటం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఈ పరిస్థితి మారాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు రాని విధంగా సేవలందించాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డీసీహెచ్ఎస్‌కు కలెక్టర్ సూచించారు. ఈ క్రమంలో ఆయా ఏరియా, సీహెచ్‌సీల్లో ఉన్న సమస్యలపై సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. జిల్లా స్థాయిలో పరిష్కరించతగిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు నివేదిక తయారు చేయాలని డీసీహెచ్ఎస్‌కు చెప్పారు.
జాయింట్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రాసుపత్రి, ఏరియా ఆసుపత్రుల నుంచి రిఫరల్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని, దీన్ని నివారించాలని పేర్కొన్నారు. స్థానికంగా అన్ని వసతులూ ఉన్నప్పటికీ రిఫరల్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని వైద్యాధికారులను ప్రశ్నించారు. ఆపరేషన్లు స్థానికంగానే చేయాలని, ప్రయివేటు లేదా బయట జిల్లాల ఆసుపత్రులకు రిఫరల్ చేయకూడదని చెప్పారు. ఆసుపత్రుల వారీగా అందుతున్న సేవలు, అక్కడున్న సమస్యలపై జేసీ అడిగి తెలుసుకున్నారు. అందరూ సమన్వయంతో ప్రజలకు ఉత్తమ సేవలందించాలని సూచించారు.
సమావేశంలో డీసీఎచ్ఎస్ నాగభూషణరావు, మహారాజ ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, సీహెచ్‌సీల, ఏరియా ఆసుపత్రులు సూపరింటెండెంట్లు, ఇతర వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————
జారీ, సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.