Close

వేసవి తాగునీటి కష్టాలకు చెక్* 👉 ఫిబ్రవరి 1 నుంచి ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం 👉జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశం

Publish Date : 19/01/2026

వేసవి తాగునీటి కష్టాలకు చెక్* 👉 ఫిబ్రవరి 1 నుంచి ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమం
👉జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశం
విజయనగరం, జనవరి 18:
జిల్లాలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 45 రోజుల పాటు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాల్లోని చేతి పంపులు, తాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేసి, మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.
             ​కలెక్టర్ తన ఆదేశాల్లో ప్రధానంగా తాగునీటి వనరుల పనితీరుపై దృష్టి సారించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు గ్రామ పంచాయతీల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. చేతి పంపులు చెడిపోయిన పక్షంలో మండల పరిషత్ నిధులతో 48 గంటల్లోగా వాటిని పునరుద్ధరించాలని, ఇందుకు అవసరమైన స్పేర్ పార్టులను ముందే మండల కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అవసరమైతే థర్డ్ పార్టీ ద్వారా అదనపు మెకానిక్‌లను నియమించుకోవాలని తెలిపారు. గ్రామీణ నీటి సరఫరా పథకాల మరమ్మతులకు గ్రామ పంచాయతీ ఫైనాన్స్ కమిషన్ నిధులను, సిపిడబ్ల్యు పథకాలకు జిల్లా పరిషత్ నిధులను వినియోగించి నిరంతర సరఫరాను నిర్ధారించాలని పేర్కొన్నారు. ​భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాల్లో చేతి పంపులకు అదనంగా రెండు పైపులు వేయాలని, ఎండిపోయిన బోర్ల విషయంలో సాధ్యమైనంత వరకు లోతు పెంచే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో రెవెన్యూ, ఎంపిడిఓ మరియు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కూడిన బృందం ప్రైవేట్ వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని, మరీ అనివార్యమైతేనే చివరి ఆప్షన్‌గా ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా చేపట్టాలని తెలిపారు. తాగునీటి వనరులను వాల్టా చట్టం కింద రక్షించాలని, నీటి నాణ్యతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ముఖ్యంగా పశువుల దాహార్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు.
​వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను జిల్లా స్థాయి ‘డ్రౌట్ మానిటరింగ్ సెల్’ కు నివేదించి తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. పత్రికల్లో వచ్చే వార్తలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
………………….
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.