వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తాం రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
Publish Date : 06/10/2022
వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తాం రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పట్టణంలో పలు సుందరీకరణ పనులు ప్రారంభం
ఉత్సవాల ప్రోమోను విడుదల చేసిన బొత్స
విజయనగరం, అక్టోబరు 05 పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పట్టణంలో పలు అభివృద్ది, సుందరీకరణ పనులను ఆయన బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సుమారు రూ.18లక్షల వ్యయంతో చేసిన గంటస్థంభం సుందరీకరణను, ఐలాండ్‌ను, వాటర్ ఫౌంటెన్‌ను ప్రారంభించారు. మయూరి జంక్షన్ నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వరకు, రూ.2.50 కోట్లతో అభివృద్ది చేసిన రైల్వేస్టేషన్ రోడ్డును, సెంటర్ లైటింగ్, వాటర్ ఫౌంటెన్లను ప్రారంభించారు. అనంతరం విజయనగరం ఉత్సవాల ప్రోమోను మంత్రి లాంఛనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, విజయనగరం పట్టణాన్ని దశలవారీగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే గంటస్థంభం, రైల్వేస్టేషన్ రోడ్లను ఆధునీకరించడం జరిగిందన్నారు. చారిత్రక పట్టణమైన విజయనగరానికి, గంటస్థంభం తలమానికమని పేర్కొన్నారు. అభివృద్ది ప్రధాన రహదారులకు మాత్రమే పరిమితం కాదని, వీధులను కూడా అభివృద్ది చేస్తామని, విజయనగరానికి ఒక వైభవాన్ని తేవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విజయనగరం ఉత్సవాలను, పైడిమాంబ సిరిమానోత్సవాన్ని సంప్రదాయ బద్దంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత రెండేళ్లూ కోవిడ్ కారణంగా, సామాన్య భక్తులు సిరిమానోత్సవానికి దూరమయ్యారని, ఈ సారి అందరినీ అనుమతించనున్నట్లు తెలిపారు. అమ్మవారి జాతరకు చుట్టుప్రక్కల జిల్లాలనుంచే కాకుండా, ఇతర రాష్ట్రాలనుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
*ఉత్సవాల ప్రోమోను విడుదల చేసిన మంత్రి*
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన, విజయనగరం ఉత్సవాల ప్రోమో (కర్టెన్ రైజర్)ను, బుధవారం సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. స్థానిక మయూరి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్‌పై ఈ ప్రోమోను మంత్రితో పాటు అతిధులంతా తిలకించారు.
ఈ కార్యక్రమాల్లో డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎంపి బెల్లాన చంద్రశేఖర్, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యుటీ మేయర్లు ఇసరపు రేవతీదేవి, కోలగట్ల శ్రావణి, మున్సిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములనాయుడు, ఇఇ శ్రీనివాసరావు, జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖాధికారి డి.రమేష్, ఇతర అధికారులు, కార్పొరేటర్లు,నాయకులు పాల్గొన్నారు.