సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Publish Date : 08/12/2025
సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబరు 06 ః
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్మాణానికి సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూసేకరణ, పూర్తి చేయాల్సిన ప్రక్రియలపై గ్రామాలవారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రూ.17,050 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే సుమారు 3.865 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని రెండు దశలుగా చేపట్టడం జరుగుతోందని, రెండో దశలోని మొత్తం 6 ప్యాకేజీల్లో మొదటి ప్యాకేజీలో కొంత భాగంతోబాటు, 2,4,5,6 ప్యాకేజీలు విజయనగరంలో ఉన్నాయని వివరించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 9,630 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని, దీనిలో కేవలం కాలువల నిర్మాణం కోసమే 4,495 ఎకరాలు అవసరం ఉంటుందని చెప్పారు. తక్షణ ప్రాధాన్యతగా 339.68 ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. వెంటనే రైతులతో సమావేశాలను నిర్వహించి ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి ఇకనుంచీ వారం వారం సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రాజెక్టు ఈఈ ఉమేష్‌కుమార్, భూసేకరణ విభాగం ఎస్‌డిసి కళావతి, చీపరుపల్లి ఆర్‌డిఓ సత్యవాణి, పలువురు డిఈలు, తాహసీల్దార్లు, డిటిలు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.


061225-A
061225-B