స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు* *గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో నయమవుతుంది*– జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 08/12/2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు*
*గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో నయమవుతుంది*
— జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 07: జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అనవసరమైన ఆందోళన లేకుండా పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులకు, ప్రజలకు సూచించారు. స్క్రబ్ టైఫస్‌పై సమగ్ర సమాచారం అందించిన కలెక్టర్ ప్రజలకు జాగ్రత్తలు, లక్షణాలు, చికిత్స గురించి తెలియజేశారు.
మైట్స్ అనే చిన్న పురుగులు కరిచినప్పుడు వచ్చే జ్వర వ్యాధినే స్క్రబ్ టైఫస్ అంటారని, ఈ వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు.
సాధారణ లక్షణాలైన అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడ్డట్టు కనిపించడం, దగ్గు, శ్వాసలో స్వల్ప ఇబ్బంది
వాంతులు, పొట్టలో అసౌకర్యం అనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని సూచించారు.
కాటు వచ్చిన చోట చిన్న నల్ల మచ్చ లేదా గాయం లాంటి బొట్టు కనిపించడం జరుగుతుందని, ఇది దుస్తుల కింద ఉండే భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుందని,
సాధారణంగా నొప్పి ఉండదని తెలిపారు. శరీరంపై ఎర్రబడ్డ దద్దుర్లు, లింఫ్ నోడ్స్ వాపు
ఆహారం తినాలనిపించకపోవడం లాంటివి కూడా ఉంటాయని తెలిపారు.
తగ్గని అధిక జ్వరం, శ్వాసలో ఇబ్బంది, మతిమరుపు, గందరగోళం, మూత్రం తగ్గడంలాంటివి సంబవిస్తే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్ష చేయించుకుని అక్కడ అందించే ఉచిత మందులతో పూర్తిగా నయమవుతుందని కలెక్టర్ స్పష్టం చేసారు.
గుర్తించిన వెంటనే వైద్యసేవలు పొందితే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయం అవుతుందని, ఈ వ్యాధి భయపడాల్సినది కాదని, జాగ్రత్తలు పాటించడం, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం అని కలెక్టర్ సూచించారు.
అలాగే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్యసిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిని వెంటనే పీహెచ్ సి, సి హెచ్ సి కి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు.
— జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం.