01.11.2025 నవంబర్ 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రత్యేక డ్రైవ్, సామాజిక భయం విడనాడండి – కుష్టు వ్యాధిని తరిమికొట్టండి — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 03/11/2025
పత్రికా ప్రకటన-3
నవంబర్ 17 నుండి 30 వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రత్యేక డ్రైవ్
సామాజిక భయం విడనాడండి – కుష్టు వ్యాధిని తరిమికొట్టండి
— జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, నవంబర్ 01: కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగల వ్యాధి అని, కుష్టు వ్యాధి సోకిన వారిని సమాజం చిన్న చూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుండి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని కలెక్టర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా కుష్టు వ్యాధి నిర్మూలన సమన్వయ కమిటీ చైర్మన్ ఎస్. రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17 నుండి 30 వరకు జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుందని, కుష్ఠు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు, సామాజిక మచ్చ వల్ల కొంతమంది ముందుకు రావడం లేదని తెలిపారు. అటువంటి అపోహలను విడనాడి ఎవరైనా చర్మంపై తెల్లటి మచ్చలు, ఎర్రటి వాపు, గడ్డలు లేదా సున్నితత్వం కోల్పోవడం వంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 1790 బృందాలతో ప్రతి ఇంటిలో వయస్సుతో సంబంధం లేకుండా ఉన్న వారందరినీ పరిశీలించి, అనుమానిత లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్య బృందాలకు తెలియజేయాలని ఆదేశించారు.
మండల అభివృద్ధి అధికారుల ద్వారా సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ను ఆదేశించారు.
ఆసుపత్రులకు వచ్చే రోగులలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే డిస్ట్రిక్ట్ లెపర్సీ అధికారి కి సమాచారం అందించాలని వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశించారు. స్వయం సహాయక బృందాలకు అవగాహన కల్పించి, బాధితులు సమాజంలో తిరిగి కలిసేలా సహకారం అందించాలని సూచించారు. అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లు, సిడిపివోలు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని ఆదేశించారు.
ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తిని పరిశీలించి, అనుమానిత కేసులను సంబంధిత మెడికల్ ఆఫీసర్ కు తెలియజేయాలని సూచించారు.
కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి ప్రజలు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, మహిళా సంఘాలు అందరూ కలసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా కలెక్టర్ జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు డిఎంహెచ్ఓ డా. కె. జీవన రాణి, జిల్లా లెపర్సీ, ఎయిడ్స్ & టిబి అధికారి డా. కే. రాణి, జిల్లా పరిషత్ సీఈఓ బి.వి. సత్యనారాయణ, డిపిఆర్ఓ గోవిందరాజులు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి విమల రాణి, మెప్మా పీడీ చిట్టిబాబు, డిపిఎం డా. సూర్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఎపిడిమాలజిస్ట్ డా. సత్యనారాయణ, డిఎన్ఎమ్ఓ డా. అర్చన, డిస్ట్రిక్ట్ ఆశ కోఆర్డినేటర్ బీ. మహాలక్ష్మి, విద్యాశాఖ ఏడి తదితర అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

1-11-A

1-11-B