01.12.2025-ఎయిర్‌పోర్టుకు వేగంగా మౌలిక సదుపాయాలు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
Publish Date : 02/12/2025
పత్రికా ప్రకటన
ఎయిర్‌పోర్టుకు వేగంగా మౌలిక సదుపాయాలు
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబరు 01 ః
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మౌలిక వసతులను కల్పించే పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయానికి రోడ్లు, కాలువలు, విద్యుత్ తదితర వసతుల కల్పన, భూ సేకరణ తదితర అంశాలపై తమ ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకానికి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం సుమారు రూ.85లక్షలతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ లైన్‌ను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమారు 15 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్‌ను వేయాల్సి ఉందన్నారు. వర్షపునీరు వెళ్లేందుకు వీలుగా దాదాపు రూ.27 కోట్ల ఖర్చుతో సుమారు 25 కిలోమీటర్ల మేర నాలుగు కెనాల్స్‌ను త్రవ్వాల్సి ఉందన్నారు. దీనికి అంచనాలను త్వరగా తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. అదేవిధంగా సవరివల్లి-తూడెం గ్రామాలమధ్య 2.3 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన సిసి రోడ్డు పనులను వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. స్టాఫ్ క్వార్టర్స్, ఇతర అవసరాల కోసం చేయాల్సిన భూసేకరణపైనా చర్చించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఆర్డిఓ డి.కీర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కవిత, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
…………………………………………………………………………………………………….
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

1-12-1

1-12-2