Close

01.12.2025 కొత్త‌గా హెచ్ఐవి కేసులు న‌మోదు కాకూడ‌దు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి వ్యాధిగ్ర‌స్తుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

Publish Date : 02/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-7

కొత్త‌గా హెచ్ఐవి కేసులు న‌మోదు కాకూడ‌దు

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

వ్యాధిగ్ర‌స్తుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం

విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 01 ః     ఇక‌పై జిల్లాలో కొత్తగా హెచ్ఐవి కేసులు నమోదు కాకుండా త‌గిన‌ జాగ్రత్తలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టరు ఎస్. రామసుందర్ రెడ్డి అధికారుల‌ను కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా  సోమ‌వారం జిల్లాలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు, బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు, వ్యాధిని నియంత్రించేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలో ర్యాలీతోపాటు స్ఠానిక ఐఎంఏ హాలులో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాన్ని, బాధితుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నాలు ఏర్పాటు చేశారు.

             ఈ కార్య‌క్ర‌మంలో  జిల్లా కలెక్టరు  రామసుందర్ రెడ్డి  మాట్లాడుతూ, హెచ్.ఐ.వి/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా చూసి, ప్రతి ఒక్కరూ తమ హెచ్.ఐ.వి. స్థితిని తెలుసుకొని జాగ్రత్త పడాలని సూచించారు. హెచ్.ఐ.వి. వ్యాధిగ్రస్తులు కూడా స‌మాజంలో భాగ‌మేన‌ని, వారిప‌ట్ల‌ వివక్షత‌ లేకుండా మనలో ఒకరిగా ఆదరించాలని కోరారు.

              అంత‌కుముందు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్య‌ద‌ర్శి డా. ఎ. కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ, బాధితులకు న్యాయపరంగా ఏమైనా సమస్యలు  ఉంటే జిల్లా లీగల్ సెల్ ద్వారా వెంటనే న్యాయం చేస్తామని తెలిపారు.

             జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎస్.జీవనరాణి, జిల్లా జైళ్ల‌శాఖ అధికారి జి.మ‌ధుబాబు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, మరియు క్షయ నియంత్ర‌ణాధికారిణి డా. కె. రాణి,  వి.ఎన్.పి ప్లస్ వైస్-ప్రెసిడెంట్ హ‌రినాధ్ మాట్లాడారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నివారణ మరియు బాధితుల పట్ల వివక్ష లేకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకతను వివ‌రించారు.

              సమావేశం అనంత‌రం హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాధితులతో, చిన్నారుల‌తో సహపంక్తి భోజనంలో పాల్గొని వారితో ముచ్చటించారు. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి కలెక్టరు చేతుల మీదుగా ప్ర‌శంసా ప‌త్రాల‌ను, బ‌హుమ‌తుల‌ను, జ్ఞాపిక‌ల‌ను అంద‌జేశారు. ఎ.బి.సి.డి., ఎన్.జి.ఓ. సహకారంతో హెచ్.ఐ.వి. రోగులకు దుప్పట్లు మరియు శ్రీ గురుదత్త సేవ సంస్థ, కొత్తవలస వారిచే న్యూట్రిషన్ వస్తువులు పంపిణీ చేయబడ్డాయి. ప్రతిజ్ఞ చేశారు.

               ఈ కార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పాజిటివ్ నెట్‌వర్క్‌లు, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి., నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………….

జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.

1-12-1

1-12-1

1-12-2

1-12-2

1-12-3

1-12-3