Close

03.12.2025 అర్హులంద‌రికీ ఇళ్లస్థ‌లాలు, స‌ర్టిఫికేట్ల మంజూరులో ఆల‌స్యం చేయొద్దు, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

Publish Date : 04/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌-3

అర్హులంద‌రికీ ఇళ్లస్థ‌లాలు

స‌ర్టిఫికేట్ల మంజూరులో ఆల‌స్యం చేయొద్దు

జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి

విజయనగరం, డిసెంబర్ 3 :  అర్హులంద‌రికీ ఇళ్ల స్థలాలు వ‌చ్చే విధంగా కృషి చేయాల‌ని, దీనికోసం వారి పేర్లు న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఇళ్ల స్థ‌లాల కోసం త‌మ పేర్లు న‌మోదు చేసుకోవ‌డానికి ఈ నెల 14 వ‌ర‌కు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చింద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి, పేర్లు న‌మోదు చేసుకొనేలా చూడాల‌ని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధ‌వారం రెవెన్యూ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఇళ్ల స్థ‌లాల మంజూరుకు గ్రామం వారీగా ప్ర‌ణాళిను రూపొందించాల‌న్నారు. ఆయా గ్రామాల్లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స్థ‌లాలు, ఇంకా ఎంత కావాల్సింది త‌దిత‌ర వివ‌రాల‌ను సిద్దం చేయాల‌ని సూచించారు. మ్యుటేష‌న్లు, ఇత‌ర రెవెన్యూ సంబంధిత ధ‌ర‌ఖాస్తుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. అదేవిధంగా ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌ర్టిఫికేట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన మంజూరు చేయాల‌ని సూచించారు.

               సివిల్ సప్లైస్ విభాగానికి సంబంధించి, రైస్ కార్డుల పెండింగ్ దరఖాస్తులను వెంట‌నే క్లియ‌ర్ చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సేధు మాధ‌వ‌న్ ఆదేశించారు. నిర్ణయించిన అజెండా అంశాలపై తాజా సమాచారంతో అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.  ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయ‌ని, గోనెసంచులు, జిపిఎస్‌తో కూడిన వాహ‌నాలు సిద్దంగా ఉన్నాయ‌ని చెప్పారు. రెండు రోజుల్లో బ్యాంకు గ్యారెంటీలు కూడా పూర్తి అవుతాయ‌ని తెలిపారు. బిజిలు రానిచోట మిల్ల‌ర్ల‌తో మాట్లాడాల‌ని సూచించారు. ద‌ళారుల‌పై దృష్టిపెట్టి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

               ఈ సమావేశంలో మొత్తం 12 రెవెన్యూ మరియు అనుబంధ శాఖల అంశాలపై ప్రధానంగా చర్చించారు. ‘హౌసింగ్ ఫర్ ఆల్, ఖాళీ స్థలాలు & రెగ్యులరైజేషన్ స్కీమ్’తో పాటు, భూ బదిలీ, 22ఏ ఫైళ్ల (మీసేవ) పరిష్కారం, వెబ్‌ల్యాండ్ మ్యుటేషన్ల పురోగతిని, కులం సుమోటో వెరిఫికేషన్‌ను, కోర్టు కేసుల వివరాలు, అలాగే జీఎస్డబ్ల్యుఎస్ ఆన్‌లైన్ సేవలు, పీజీఆర్ఎస్ కు సంబంధిత అంశాలపై సమీక్షించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విభాగం తరపున ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించారు. సర్వే విభాగం ద్వారా చేపడుతున్న రీసర్వే, జాయింట్ ఎల్‌పీఎంలు మరియు పౌర సేవలపై కూడా చర్చ జరిగింది. చివరగా, వ్యవసాయ శాఖ పరిధిలో ఏపీ రైతు నమోదు స్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇన్‌ఛార్జి డిఆర్ఓ ముర‌ళి మాట్లాడుతూ, బిఎల్ఓల‌కు సంబంధించిన అంశాల‌ను వివ‌రించారు.

             వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, క‌లెక్ట‌రేట్ సెక్ష‌న్ సూప‌రింటిండెంట్లు, జిల్లా సరఫరా అధికారి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, సర్వే & ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, 27 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

…………………………………………………………………………………………………..

జారి : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి, విజయనగరం.

3-12-1

3-12-1

3-12-2

3-12-2