03.12.2025 రైతు ఆదాయం సర్కులర్ ఎకానమీ, జిల్లా జి.వి.ఎ. పెరుగుదలకురైతులే బలమైన ఆధారం– జిల్లాకలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 04/12/2025
పత్రికా ప్రకటన
రైతు ఆదాయం సర్కులర్ ఎకానమీ
జిల్లా జి.వి.ఎ. పెరుగుదలకు రైతులే బలమైన ఆధారం
– జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 03: జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులతో వర్క్ షాపులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బొండపల్లి మండలం గొట్లాం రైతు సేవ కేంద్రంలో ఏర్పాటుచేసిన వర్క్ షాప్ లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రైతు ఆదాయం పెంపుతో కూడిన సర్కులర్ ఎకానమీ మోడల్‌గా ప్రభుత్వం గుర్తించిందని, ప్రతి శాఖ సమన్వయంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా జి.వి.ఎ (Gross Value Added) పెరుగుదలకు వ్యవసాయ రంగం కీలకమన్నారు. రైతు ఆదాయం పెరిగితే జిల్లా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
రైతులను ఉద్యాన పంటల వైపు విస్తృతంగా ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్, మామిడి, జీడిపప్పు వంటి పంటల్లో మొదటి ఐదు సంవత్సరాలు అంతర పంటలు వేసి అదనపు ఆదాయం పొందే అవకాశాలను వివరించాలని ఆదేశించారు.
అంతర పంటలతో రైతుకు తక్షణ ఆదాయం లభించడంతో పాటు, ప్రధాన పంటలకు అనువైన నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు.
డ్రోన్లు, మట్టి ఆరోగ్య కార్డులు, మొబైల్ యాప్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ వంటి అధునాతన టెక్నాలజీ వినియోగం వ్యవసాయంలో తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతుల ఉత్పత్తులకు విలువ జోడించేందుకు గ్రామ, మండల స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, యువతను కూడా ఈ రంగంలో ప్రోత్సహించాలని సూచించారు.
డిసిసిబి చైర్మన్ నాగార్జున మాట్లాడుతూ,
రైతుల ఆదాయం, జీవన ప్రమాణం పెరగాలంటే వినూత్న పద్ధతుల్లో, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించాల్సిన అవసరం ఉందని సూచించారు. పండిన పంటలను గ్రేడింగ్, ప్యాకింగ్, నాణ్యత ప్రమాణాలతో విక్రయిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
రైతులు పంటలు పండిస్తూనే అరకొర జీవితం గడుపుతున్నారనీ, ఈ పరిస్థితి మారాలంటే ప్రస్తుత పద్ధతులను మార్చాలని స్పష్టం చేశారు.
వ్యవసాయ ఖర్చులను తగ్గిస్తూ, ఉత్పత్తిని పెంచే ఆధునిక సాంకేతికత వైపు రైతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
అదేవిధంగా, డిసిసిబి తరఫున ఇళ్లలో రూఫ్ గార్డెనింగ్ కోసం సహకారం అందిస్తామని తెలిపారు. ఇది కుటుంబ స్థాయి ఆహార భద్రతకు, పట్టణాలలో పచ్చదన విస్తరణకు దోహదం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, బిజెపి రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, ఏఎంసి చైర్మన్ గోపాల్ రాజు, జనసేన ఇన్చార్జ్ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి జిటి రామారావు, పలువురు రైతు సంఘం ప్రతినిధులు, రైతులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
================
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం

3-12-1

3-12-2