04.12.2025 విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసానిద్దాం, జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవు, అదనంగా ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, చెరకురైతుల సమస్యలపై ప్రత్యేక సమావేశం పెట్టాలి, రాష్ట్ర ఎంఎస
Publish Date : 05/12/2025
పత్రికా ప్రకటన
విద్యార్ధుల భవిష్యత్తుకు భరోసానిద్దాం
జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవు
అదనంగా ధాన్యం తీసుకుంటే చర్యలు తప్పవు
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత
చెరకురైతుల సమస్యలపై ప్రత్యేక సమావేశం పెట్టాలి
రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖామంత్రి కొండపల్లి
జిల్లాలో మాతృమరణాలు సంభవిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
జిల్లా సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చ
విజయనగరం, డిసెంబరు 04 ః విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విద్యార్ధులకు నైతిక విలువలను బోధించడంతోపాటు ఫోక్సో తదితర చట్టాలపైన, డ్రగ్స్ వల్ల కలిగే దుష్పలితాలపైనా బాలురకు అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలను బాలికలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలవద్ద సిసి కెమేరాలను ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా సమీక్షా సమావేశం గురువారం జరిగింది. జిల్లా అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల అమలపై కూలంకషంగా చర్చించారు. వ్యవసాయం, ఉద్యాన సాగు, విద్య, వైద్యం, ధాన్యం కొనుగోలు, నీటి పారుదల, రీసర్వే, రెవెన్యూ అంశాలు, గృహనిర్మాణం, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అధికారులు ఖచ్చితమైన వివరాలతో నివేదికలను తమకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించిన పలు అంశాలుపై చర్చించాల్సి ఉందని, అందువల్ల ఇరిగేషన్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పదిరోజుల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాజెక్టులకు భూసేకరణను త్వరగా పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చర్చ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ మిల్లర్లు అదనంగా ఐదు కేజీల వరకు రైతులనుంచి తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఏ మిల్లరైనా రైతులనుంచి అదనంగా ధాన్యం తీసుకున్నట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంతో కష్టపడి పంట పండించే రైతన్నను దగాచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
విపరీతంగా ఎరువులు వేసి పండించే పంటలువల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, కేన్సర్ కేసులు పెరిగిపోవడానికి కూడా ఇది ఒక కారణమని పేర్కొన్నారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వ శాఖలమద్య సమన్వయం అవసరమని చెప్పారు. మ్యుటేషన్లకు సంబంధించి రెవెన్యూశాఖలో అవినీతి ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం క్రిందిస్థాయి నుంచి మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఏ చర్యలు తీసుకున్నా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. పదోతరగతిలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, చెరకు రైతుల సమస్యలపై చర్చించేందుకు, మద్దతు ధరకు అందించేందుకు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేన్ అధికారిని ఆదేశించారు. సమావేశం పెట్టకుండానే మద్దతు ధరను ఎలా ప్రకటిస్తారంటూ కేన్ అధికారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సేంద్రీయ ఉత్ప్తులను విక్రయించేందుకు డ్వాక్రా సంఘాల ద్వారా స్టాల్స్‌ను ఏర్పాటు చేసి, విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహాన్ని కూడా పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని వెళ్లడించారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి అంటువ్యాధి కాదని మంత్రి చెప్పారు. ఈ వ్యాధిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సూచించారు.
జెడ్‌పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రస్తావించారు. ఈకెవైసిలో లోపాలు జరుగుతున్నాయని, సంపత్ స్వర్ణలో నూకల శాతం ఎక్కువగా ఉందని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంవల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. రీసర్వే, ఇళ్ల మంజూరుపై ఆయన ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడైనా మాతృమరణాలు సంభవిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సైతం అత్యున్నత ప్రభుత్వ యంత్రాగం ఉందని, ప్రభుత్వం మంచి పోషకాహారాన్ని సరఫరా చేస్తోందని, అయినప్పటికీ అక్కడక్కడా మాతృ, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని అన్నారు. ఇకముందు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రశ్నలకు అధికారుల తరపున కలెక్టర్ సవివరంగా సమాధానాలిచ్చారు. స్క్రబ్ టైపస్ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. పిహెచ్‌సిల్లోనే ర్యాపిడ్ టెస్టులు ఉన్నాయని, అక్కడ నిర్ధారణ అయితే కేంద్రాసుపత్రికి వచ్చి తదుపరి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీనిపై తప్పుడు నివేదికలను ఇచ్చిన కొన్ని ప్రయివేటు ఆసుపత్రులకు నోటీసులిచ్చామని చెప్పారు. టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి జాయింట్ కలెక్టర్ ఎస్.సేధుమాధవన్ వివరించారు.
ఎంఎల్‌సిలు డాక్టర్ పివివి సూర్యనారాయణరాజు, ఇందుకూరి రఘురాజు, కావలి గ్రీష్మ, ఎంఎల్ఏలు కోండ్రు మురళీమోహన్, బేబీ నాయన, లోకం నాగమాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి, డిసిసిబి ఛైర్మన్ కిమిడి నాగార్జున, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు తదితరులు మాట్లాడుతూ పలు ప్రజా సమస్యలను, తమ నియోజకవర్గాలకు చెందిన అంశాలను ప్రస్తావించారు.
……………………………………………………………………………….
జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవు
జిల్లాలో స్క్రబ్ టైఫస్ వైరస్ కేసులు లేవని మంత్రి అనిత చెప్పారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చర్చించిన అంశాలగురించి వివరించారు. స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని, దీనికోసం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యాధిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రిని లేదా కొన్ని విభాగాలను తరలించే అంశాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి నివేదిక ఇచ్చాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజల ఆరోగ్యరీత్యా పంటల్లో ఎరువుల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. విద్యాబోధనలో తల్లితండ్రులను భాగస్వాములను చేయడం, అత్యత్తమ విద్యను అందించడమే ధ్యేయంగా మెగా పిటిఎంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ధాన్యం సొమ్మును కేవలం 24 గంటల్లోనే రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్‌టిజిఎస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలను సమన్వయం చేసుకొని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించేటప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తున్నామని చెప్పారు. దీనికి ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. మహాకవి గురజాడ అప్పారావు ఇంటివద్ద నిఘాను పెంచాలని, దీనికోసం సిసి కెమేరాలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి అనిత చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మంత్రి చెప్పారు.
……………………………………………………………………………………………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

4-12-1

4-12-2

4-12-3

4-12-4

4-12-5

4-12-6

4-12-7

4-12-8