05.12.2025 విలువలతో కూడిన విద్య, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ముఖ్యం, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలి -*మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 06/12/2025
పత్రికా ప్రకటన
విలువలతో కూడిన విద్య, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ముఖ్యం
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలి
-*మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 05: గంట్యాడ కేజీబీవీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్, టీచర్ మీట్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ విద్యలో విలువలు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.
పదో తరగతి, ఇంటర్ విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పాఠశాలలు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని బట్టి ఏ–బి–సి–డి గ్రేడులుగా విభజించినపుడు, సి–డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులు కొంతమంది మాత్రమే కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడి ఉండవచ్చని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మరియు పేరెంట్స్ ప్రోత్సాహంతో వారు సులభంగా ఏ–బి గ్రేడ్లకు చేరుకోవచ్చని తెలిపారు.
వెనుకబడిన సబ్జెక్టులను గుర్తించి మెరుగుపరుచుకోవడం ద్వారా 100% ఫలితాలు సాధించడం పూర్తిగా సాధ్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
1990లలో ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగంలో భారత్ ముందుండడంతో అనేక మంది దేశవిదేశాల్లో స్థిరపడగలిగారని గుర్తుచేస్తూ, విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలకు చేరాలని ఆకాంక్షించారు.
ముందుగా కలెక్టర్ విద్యార్థుల స్థితిగతులను వారి వారి తల్లిదండ్రులకు వివరించారు. అదేవిధంగా తరగతి గదులను పరిశీలించి లాబరేటరీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుని అవతారం ఎత్తి ఫ్రాక్షన్, రిఫ్రాక్షన్ గురించి కుంభాకార పుటాకార అద్దాల గురించి విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా కొన్ని కెమికల్స్ ని చూపించి వాటి శాస్త్రీయ నామాలను విద్యార్థుల నుండి రాబట్టారు. సమావేశంలో భాగంగా పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చి వారిలో చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపారు.
డీఈఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్, టీచర్ మీట్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలు చదువుతున్నారంటే, ఉపాధ్యాయులు బోధిస్తున్నారంటే సరిపోదని, తల్లిదండ్రుల సహకారం విద్యార్థుల అభ్యాసానికి కీలకం అని అన్నారు. విద్యార్థుల లోపాలు గుర్తించడం, వారి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడం కోసం ఈ మీట్ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు. విద్యతోనే జీవితంలో మార్పు వస్తుందని, విలువలు పెరుగుతాయని, పిల్లలే మన అసలు ఆస్తి కాబట్టి దేశ సంపదను పెంచేలా వారు రాణించాలని ఆకాంక్షించారు.
కేజీబీవీలో అన్ని సౌకర్యాలతో పాటు రక్షణ, పర్యవేక్షణ సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాది సాధించిన 94 శాతం ఫలితాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయని డీఈఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విమల రాణి, స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ డి గౌరీ, కేజీబీవీ ప్రిన్సిపాల్ జ్యోతి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
=============
జారీ: జిల్లా సమాచార పోరసంబంధాలు అధికారి, విజయనగరం

5-12-1

5-12-2

5-12-3

5-12-4