07.02.2026 స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేద్దాం* *విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన* *20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్*
Publish Date : 11/02/2026
పత్రికా ప్రకటన
*స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేద్దాం*
*విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వత ఆస్తుల కల్పన*
*20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్*
విజయనగరం, ఫిబ్రవరి 07 :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన వికసిత భారత్ సంకల్పంలో భాగంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ ప్రాంతం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, గణనీయమైన అభివృద్ది జరుగుతుందని చెప్పారు.
రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డితో కలిసి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
విబి-జిఆర్ఏఎంజి, విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, అమృత్, పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలపై చైర్మన్ లంకా దినకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం స్థానంలో ఏప్రెల్ నుంచి అమలు చేయనున్న విబి-జిఆర్ఏఎంజి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవక మిషన్ -గ్రామీణ్) వల్ల గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ పథకం కోసం కేంద్రం గతం కంటే ఎక్కువగా, తన 60 శాతం వాటా క్రింద 96వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అంతేకాకుండా ఈ పథకం అమల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా పారదర్శకతను పెంచడంతోపాటు, ఫేస్ రికగ్నైజేషన్, జియో ట్యాగింగ్, ఆన్‌లైన్ మెజర్‌మెంట్ తదితర ఆధునిక విధానాలను ప్రవేశపెట్టడమే కాకుండా, పనిదినాలను 125 రోజులకు పెంచడం తదితర వినూత్న మార్పులను చేసిందని తెలిపారు. ఈ పథకం వల్ల గ్రామీణ పేదలకు గతం కంటే మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 లక్షల నకిలీ జాబ్ కార్డులను తొలగించి, కొత్తగా అర్హులైన 5.5 లక్షల మందికి కొత్త కార్డులను జారీ చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వం అందుబాటులో ఉన్న ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులను వినియోగించకోకుండా మురగబెట్టిందని చెప్పారు.
ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన త్రాగునీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్ మరియు అమృత్- 1,2 పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ క్రింద సుమారు రూ. 30వేల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా, గత ప్రభుత్వ హయాంలో నిధులను ఖర్చుచేయలేదని చెప్పారు. విద్యా శాఖకు సంబంధించి జిల్లాలో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం (పీఎం పోషణ్ ), సమగ్ర శిక్ష ద్వారా అమలవుతున్న పీఎం శ్రీ స్కూల్స్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర తదితర పథకాల అమలు తీరుపై విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, విద్యార్ధులకు కంటి పరీక్షలపై ఆరా తీశారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ తల్లికి వందనం పథకాన్ని అందజేయాలని సూచించారు.
వైద్యారోగ్యంపై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది. గర్భం దాల్చిన దగ్గరనుంచి బిడ్డ పుట్టి పెరిగే వరకు ఎన్నో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఛైర్మన్ దినకర్ సూచించారు. జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ( విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్,) మదర్ అండ్ చైల్డ్ ట్రాకింగ్ సర్వీసెస్ (ఆర్. సి. హెచ్), ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్, జనని శిశు సురక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి సురక్షిత్ మైత్రి అభియాన్, రాష్ట్రీయ కిషోర్ స్వస్థత కార్యక్రమం, ప్రధానమంత్రి టీబి ముక్త్ భారత్ అభియాన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, జన సురక్ష యోజన పథకాలకు సంబంధించి జిల్లాలో అమలుతీరును వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలను తగ్గించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుష్మాన్ భారత్ కార్డులను అర్హులందరికీ అందజేయాలని సూచించారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన పథకం అమలును తెలుసుకున్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను మరింత పెంచాల్సిన అవసరమం ఉందన్నారు. జిల్లా ఆసుపత్రిలో భవనాలను పెంచి, వైద్య సేవలను మెరుగుపర్చడం, టిబి ఆసుపత్రి మరమ్మతులు, డిసిహెచ్ఎస్ కార్యాలయం, హోమియో ఆసుపత్రి తరలింపు పై చర్చించారు. పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్ పథకాలను ఎక్కువమందికి వర్తింపజేయాలని సూచించారు.
*పాఠశాలలను తనిఖీ చేయాలి*
*మంత్రి కొండపల్లి శ్రీనివాస్*
20 సూత్రాల పథకం అమలు ఛైర్మన్ లంకా దినకర్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతమైన సమీక్షలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా ఉంటూ రాష్ట్రానికి మేలు చేస్తున్నారని ప్రశంసించారు. పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్ధులకు త్రాగునీటి పరీక్షలు నిర్వహించి, వచ్చిన నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 108,104 సేవలను సక్రమంగా అందించాలని, అవసరమైతే వాహనాల సంఖ్యను పెంచాలని మంత్రి సూచించారు. ఇళ్లకోసం చేసుకున్న ధరఖాస్తుల్లో కొన్ని పెండింగ్‌లో ఉండిపోయాయని, వారు మళ్లీ ధరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని హౌసింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.
*పిఎం సూర్యఘర్ అమల్లో ద్వితీయ స్థానం*
*జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి*
పిఎం సూర్యఘర్ పథకం అమల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సుమారు 30,550 ఎస్‌సి, ఎస్‌టిల ఇళ్లకు ఈ నెలాఖరుకి ఈ పథకాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పథంలో వికసిత్ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ది నిధులతో జిజిహెచ్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. జిజిహెచ్ నుంచి కెజిహెచ్‌కు రిఫరల్ కేసులను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్దులకు దంత ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని సూచించారు. విద్యార్దులకు సురక్షిత నీరు అందించేందుకు వాటర్ ఫ్యూరిఫయ్యర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్‌సిలు డాక్టర్ పి.సురేష్‌బాబు, ఇందుకూరి రఘురాజు, విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. విజయనగరం పట్టణానికి త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు నాగావళి-చంపావతి-గడిగెడ్డ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని ఎంఎల్ఏ కోరారు. జిజిహెచ్‌ను మరమ్మతు చేయాలని, భవనాలు సరిపోవడం లేదని, అదనపు భవనాలను కేటాయించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, సిపిఓ పి.బాలాజీతోపాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
………………………… ………………………… ………………………… ……………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

11-2-1

11-2-2