18.11.2025- Revised పదవ తరగతిఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాలి–జిల్లాకలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
Publish Date : 19/11/2025
పత్రిక ప్రకటన
పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించాలి
–జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం, నవంబర్ 18: పదవ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో ముందంజలో నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన విద్యా విభాగ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రతిభను కొలిచే మొదటి ప్రమాణం వారి ర్యాంకేనని ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యూహాలు రూపొందించి విద్యార్థులను మెరుగైన ఫలితాల కోసం ప్రోత్సహించాలని సూచించారు. తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అదనపు బోధన అందించాలని, పాఠశాల విడిచిపెట్టే వారి సంఖ్యను తగ్గించేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో శుభ్రత, పరిశుభ్ర వాతావరణం, పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడం వంటి అంశాలను ప్రాధాన్యంగా చూడాలని ఆదేశించారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టి పెట్టి మెనూను కచ్చితంగా పాటించాలని, అన్నం వండేటప్పుడు ‘వార్చడం’ పద్ధతి పూర్తిగా మానుకోవాలని,గ్యాస్ స్టౌ మీదే ఆహారం తయారు చేయాలని సూచించారు. పాఠశాల ఆర్వో ప్లాంట్ల నిర్వహణ బాధ్యత హెడ్‌మాస్టర్లదేనని, ఆర్వో ప్లాంట్లు లేని పాఠశాలలకు త్వరలోనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరుగుదొడ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
డీఈవో మాణిక్యం నాయుడు మాట్లాడుతూ, గత సంవత్సరం 87% పాస్ రేట్‌తో రాష్ట్రంలో జిల్లా ఏడవ స్థానంలో నిలిచిందని, ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డిసెంబర్ 5 లోపు మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పర్యవేక్షణను క్రమం తప్పకుండా కొనసాగిస్తామని తెలిపారు.
పిల్లల శారీరక దృఢత్వం కోసం పాఠశాలల్లో ఆట స్థలాలు సక్రమంగా ఉండాలని, పిల్లల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన
అంశమని అన్నారు.
సమావేశం అనంతరం ఉత్తమ సేవలందించిన స్కౌట్ మాస్టర్స్‌ను కలెక్టర్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
================
జారీ : డిఐపిఆర్ఒ, విజయనగరం

18-11-1

18-11-2

18-11-3