Close

18.12.2025 నైపుణ్య శిక్ష‌ణ‌, గృహ‌నిర్మాణంలో గ‌ణనీయ ప్ర‌గ‌తి* *ఆర్థికాభివృద్దిరేటులో జిల్లాకు 8వ స్థానం* *మున్సిప‌ల్ సేవ‌ల్లో భేష్‌* జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డికి ప్ర‌శంస‌లు

Publish Date : 19/12/2025

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌
*నైపుణ్య శిక్ష‌ణ‌, గృహ‌నిర్మాణంలో గ‌ణనీయ ప్ర‌గ‌తి*
*ఆర్థికాభివృద్దిరేటులో జిల్లాకు 8వ స్థానం*
*మున్సిప‌ల్ సేవ‌ల్లో భేష్‌*
జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డికి ప్ర‌శంస‌లు
విజ‌య‌న‌గ‌రం, డిసెంబ‌రు 18 :
అభివృద్ది రేటులో విజయ‌న‌గ‌రం జిల్లా  గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తిని సాధించింది.  జిల్లాలో అభివృద్ది కార్య‌క్ర‌మాల అమ‌ల్లో, ప్ర‌జ‌ల‌కు స‌కాలంలో స‌క్ర‌మంగా సేవ‌ల‌ను అందించ‌డంలో కూడా మెరుగైన ప‌నితీరు క‌న‌ప‌ర్చినందుకు రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు నుంచి అభినంద‌న‌లు ద‌క్కాయి.
ముఖ్యంగా నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ‌, పేద‌ల‌కు గృహ‌నిర్మాణంలో కూడా జిల్లా ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. వివిధ కార్య‌క్ర‌మాల అమ‌లుపై త‌ర‌చూ ప్ర‌భుత్వం నిర్వ‌హించే ఐవిఆర్ఎస్ స‌ర్వేలో 69.14 శాతం సానుకూల‌త వ్య‌క్తం కావ‌డంతో, జిల్లాకు మెరుగైన స్థానం ద‌క్కింది. ప్ర‌భుత్వం  రెండు రోజుల‌పాటు రాష్ట్ర రాజ‌ధానిలో క‌లెక్ట‌ర్స్‌తో ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన స‌మావేశంలో వివిధ అంశాల్లో జిల్లా ప్ర‌గ‌తికి అభినంద‌న‌లు ద‌క్కాయి.
                 జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి  నిరంత‌రం వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌డం, వ‌చ్చిన కొద్ది నెల‌ల్లోనే ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మాల‌ను ప‌రుగులు పెట్టించ‌డంతో, అభివృద్ది రేటులో జిల్లాకు రాష్ట్రంలోనే 8వ స్థానం ద‌క్కింది. ఈ అర్ధ‌సంవ‌త్స‌రంలో మ‌న జిడిపి వృద్దిరేటు గ‌ణ‌నీయంగా పెరిగింది. అదేవిధంగా వ‌చ్చే అర్ధ‌సంవ‌త్స‌రంలో, రాష్ట్రంలో 80 శాతం ఆదాయాన్ని ఇచ్చే జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు కూడా చోటు ద‌క్క‌నుండ‌టం మ‌న ప్ర‌గ‌తికి తార్కాణంగా చెప్ప‌వ‌చ్చు. స్వ‌ర్ణాంధ్ర ప‌ది సూత్రాల్లో భాగంగా, నిరుద్యోగ యువ‌త‌కు శిక్ష‌ణ ఇచ్చి, వారి ఉపాధి అవ‌కాశాల‌ను మెరుగు ప‌ర్చేందుకు చేప‌ట్టిన నైపుణ్య శిక్ష‌ణా కార్య‌క్ర‌మాల్లో రాష్ట్రంలోనే 3వ స్థానం ద‌క్క‌డం విశేషం. త‌ర‌చూ జాబ్ మేళాల‌ను నిర్వ‌హిస్తూ యువ‌త‌కు ఉద్యోగావ‌శాల‌ను క‌ల్పిస్తున్నారు. పేద‌ల‌కు గూడు క‌ల్పించే గృహ‌నిర్మాణ ప‌థ‌కం పిఎంఏవై అమ‌ల్లో జిల్లాకు నాల్గ‌వ స్థానం ద‌క్కింది.
                జిల్లా క‌లెక్ట‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి పిజిఆర్ఎస్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం, ప్ర‌తీవారం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌టంతో, వ్య‌క్తిగ‌త ఫిర్యాదుల‌కు సంబంధించి ప్ర‌జ‌లనుంచి 97 శాతం సానుకూల అభిప్రాయం వ్య‌క్త‌మ‌య్యింది. అదేవిధంగా సామాజిక ఫిర్యాదుల‌కు సంబంధించి 100 శాతం సానుకూల‌త వ్య‌క్తం కావ‌డం చెప్పుకోద‌గ్గ‌ విశేషం. అదేవిధంగా పుర‌పాల‌క సేవ‌ల్లో కూడా మ‌న జిల్లాకు అభినంద‌న‌లు ద‌క్కాయి. ట్రేడ్ లైసెన్సుల జారీలో, బిపిఎస్‌లో మంచి ఫ‌లితాలు క‌నిపించాయి. ఇదే ప్ర‌గ‌తిని కొన‌సాగించ‌డంతోపాటు, మిగిలిన రంగాల‌పై కూడా దృష్టి పెట్టాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి సూచించారు.
………………………………………
జారీ ః జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం

18-12-1

18-12-1

18-12-2

18-12-2