20.11.2025-సానుభూతి కాదు…సహానుభూతి చూపండి ఇతర వర్గాలతో సమానంగా ఎస్సీలు ఎదగాలి వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలి రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ జిల్లాలో విస్తృత పర్యటన
Publish Date : 21/11/2025
పత్రికా ప్రకటన
సానుభూతి కాదు…సహానుభూతి చూపండి
ఇతర వర్గాలతో సమానంగా ఎస్సీలు ఎదగాలి
వారికి సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలి
రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్
జిల్లాలో విస్తృత పర్యటన
విజయనగరం, నవంబరు 20 ః
ఎస్సీలపట్ల సానుభూతి కాకుండా, వారి బాధలను మనస్ఫూర్తిగా అర్ధం చేసుకొని సహానుభూతి చూపించాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ కోరారు. ఇతర వర్గాలతో సమానంగా ఈ 15 శాతం జనాభా కూడా అభివృద్ది చెందేందుకు ప్రతీఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. కమిషన్ సెక్రటరీ ఎస్.చినరాముడుతో కలిసి ఛైర్పర్సన్ జవహర్ గురువారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కమిషన్కు కలెక్టరేట్ వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పి ఏఆర్ దామోదర్తో కలెక్టర్ ఛాంబర్లో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అంతకు ముందు స్థానిక జిల్లా పరిషత్ అతిధిగృహంలో ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 45 వినతులు అందాయి. మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలుతీరును తెలుకున్నారు. అనంతరం వివిధ ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయి పరిస్థితులను ఛైర్పర్సన్ పరిశీలించారు.
సమీక్షా సమావేశంలో ఛైర్పర్సన్ జవహర్ మాట్లాడుతూ, సంగీత సాహిత్యాలకు నిలయమైన విజయనగరం జిల్లాపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు. జనాభాలో సుమారు 15 శాతంగా ఉన్న ఎస్సీలకు భరోసా కల్పించాలని, వారికి సామాజిక న్యాయంతోపాటు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అందేలా చూడాలని సూచించారు. అట్రాసిటీ కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా, గాయపడిన వారి మనసులకు స్వాంతన చేకూర్చాలని కోరారు. ఎన్నో సామాజిక ఉద్యమాలు జరిగిన ఈ ప్రాంతంలో కూడా ఎస్సీల పట్ల వివక్షత కొనసాగుతుండటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వారికి విద్య, వైద్యం, చక్కని ఆహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎస్సీలకు తమ వాటా దక్కేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందుతున్న ప్రయివేటు విద్యాసంస్థల్లో కూడా ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కువగా పర్యటిస్తూ, పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఆర్డిఓ, డిఎస్పి స్థాయి అధికారులు ఎస్సి బాలుర హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని ఆదేశించారు.
కమిషన్ కార్యదర్శి చినరాముడు మాట్లాడుతూ, దళితులనుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భూములకు సంబంధించినవే వస్తున్నాయని చెప్పారు. వారి సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని, చూపలేని పక్షంలో కారణాలను సవివరంగా తెలియజేసి, పరిష్కార మార్గం చూపించాలని సూచించారు. కులం పేరుతో దూషిస్తున్నారన్న కేసులు ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్తున్నాయని, వీటిని అరికట్టాలని కోరారు. ఎస్సీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని, అందువల్లే కమిషన్ కు తొలిసారిగా ఒక ఐఏఎస్ అధికారిని కార్యదర్శిగా నియమించిందని తెలిపారు. జిల్లాలో విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీ సమావేశాలు, సివిల్ రైట్స్ డే నిర్వహణ చక్కగా జరుగుతోందని అభినందించారు.
కమిషన్ ఆదేశాలపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పందిస్తూ, 15 రోజుల్లో తగిన చర్యలను తీసుకుంటామని తెలిపారు. పిజిఆర్ఎస్ లో పింఛన్ దారుల సంతృప్తే ముఖ్యంగా వివిధ చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. దీనిలో భాగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఫిర్యాదుదారులను మండల ప్రత్యేకాధికారులు నేరుగా సంప్రదించి, వారి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని వివరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీల వివరాలను అందజేస్తామని చెప్పారు. పారిశుధ్యం, త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అన్ని పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా ప్రతీనెలా హాస్టళ్లు, పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పి ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో అట్రాసిటీ కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతూ బాధితులకు న్యాయం అందేవిధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఎస్సి కాలనీలు, దళిత వాడల్లో తరచూ పర్యటిస్తూ వారికి భరోసా కల్పించేందుకు తమ శాఖ పరంగా ప్రయ్నతం చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్, ఏఎస్పి సౌమ్యలత, డిఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సాంఘిక సంక్షేమశాఖ డిడి అన్నపూర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఇడి వెంకటేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
……………………………………………………………………………………………………..
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.

20-11-1

20-11-2

20-11-3