24 గంటలూ క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది ఉండాలి జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రేషన్ పంపిణీ శత శాతం పూర్తి కావాలని ఆదేశం రాత్రంతా కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
Publish Date : 29/10/2025
24 గంటలూ క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది ఉండాలి
జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
రేషన్ పంపిణీ శత శాతం పూర్తి కావాలని ఆదేశం
రాత్రంతా కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్
విజయనగరం, అక్టోబరు 28 ః
రేషన్ పంపిణీ బుధవారంలోగా శతశాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మోంథా తుఫాను తీరం దాటనున్న కారణంగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ లోనే ఆయన మంగళవారం రాత్రంతా ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడినుంచి నిరంతరం మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి పరిస్థితిని తెలుసుకుంటూ పలు ఆదేశాలను జారీ చేశారు. కాల్‌సెంటర్లు, సచివాలయాలు, ఇతర ముఖ్యమైన శాఖల సిబ్బంది 24 గంటలూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలతోపాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రహదారులు పాడైనా, చెట్లు కూలినా వెంటనే తొలగించి క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, విద్యుత్ స్తంభాలు నేలకూలితే వాటిని మార్చేందుకు అవసరమైన పరికరాలు, స్తంబాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా చెరువులకు గండి పడితే పూడ్చేందుకు ఇసుక బస్తాలు, ఇతర సామగ్రిని సిద్దంగా ఉంచాలని సూచించారు.
*రేషన్ పంపిణీ పూర్తి కావాలి*
మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మండల ప్రత్యేకాధికారులు, తాహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఇతర మండల స్థాయి అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబరు నెల రేషన్ సరుకుల పంపిణీని ముందుగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే జిల్లాలో పంపిణీ మొదలయ్యిందని చెప్పారు. బుధవారం నాటికి అన్ని గ్రామాల్లో శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తుఫాను సన్నద్దత, త్రాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్దరణ, రహదారుల పునరుద్దరణ, చెరువులకు గండ్లు పూడ్చివేత తదితర 6 కీలక అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఎటువంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, ఒకవేళ ఎక్కడైనా రహదారులు దెబ్బతిన్నా, చెట్లు పడిపోయినా, విద్యుత్ సరఫరా ఆగిపోయినా తక్షణమే స్పందించి, పునరుద్దరించేదుకు అవసరమైన సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో సిద్దంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
………………………… ………………………… ………………………… ……………………..
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం.