29-10-2025-జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని అభినందించిన ముఖ్యమంత్రి
Publish Date : 30/10/2025
పత్రికా ప్రకటన
*జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని అభినందించిన ముఖ్యమంత్రి*
విజయనగరం, అక్టోబర్ 29: మొంథా తుఫాన్ సమయంలో నిర్విరామంగా కృషి చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా సేవలు అందించినందుకు, సమయస్ఫూర్తితో, సమన్వయం, మానవతా దృక్పథంతో వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ని, జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం, ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చురుకైన చర్యలు తీసుకోవడంతోబాటు, సమిష్టి కృషి ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి జిల్లానుద్దేశించి పేర్కొన్నారు.
సమష్టి కృషితో బుధవారం జిల్లాలోని తుఫాన్ ప్రభావం, నష్టాలు గూర్చి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా ముఖ్యమంత్రి అభినందనలకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తుఫాన్ సమయంలో ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవసరమైన సరకులు అందించడం, సమాచారాన్ని నిరంతరం కలెక్టరేట్ కు చేరవేయడం వంటి విధుల్లో చూపిన అంకితభావం ప్రజలకు రక్షణ కవచంగా మారిందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. జిల్లా అధికారులు, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖలతో సమన్వయం పాటిస్తూ సచివాలయ సిబ్బంది చూపిన సేవలు ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చెప్పారని తెలిపారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రశంసించిన విషయాన్ని వెల్లడించారు. యంత్రాంగం సంపూర్ణ సహకారం, కృషి ఫలితంగా ఈ అభినందనలు పొందమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే సమన్వయంతో, సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు, మండల ప్రత్యేక అధికారులకు, ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో చక్కగా విధులను నిర్వహించిన సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.
…………
జారీ : జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.

2910