29-10-2025-తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వ ముందుచూపు భేష్ జిల్లా కలెక్టర్ పనితీరు అభినందనీయం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరంలో విస్తృత పర్యటన
Publish Date : 30/10/2025
పత్రికా ప్రకటన
తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వ ముందుచూపు భేష్
జిల్లా కలెక్టర్ పనితీరు అభినందనీయం
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి
రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరంలో విస్తృత పర్యటన
విజయనగరం, అక్టోబరు 29 ః
మోంథా తుఫానును ఎదుర్కొనడంలో ప్రభుత్వం అనుసరించిన ముందుచూపు అభినందనీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకపోవడానికి కారణం, ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్తచర్యలేనని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ, ప్రతీ మూడు గంటలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలను ఇస్తూ, రాత్రంతా కంట్రోల్‌రూములోనే ఉండి పర్యవేక్షించారని అభినందించారు.
గజపతినగరంలో మంత్రి శ్రీనివాస్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా ఆయన గంగచోళ్లపెంట గ్రామంలో పర్యటించి, ఇళ్లు కూలిన బాధితులను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇల్లు పునర్‌నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి చెందిన కాళ్లూరి అరవింద్ భాస్కర్ తేజకు ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,56,000 విలువైన చెక్కును మంత్రి అందజేశారు. అనంతరం గజపతినగరం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. నెలరోజుల ముందే పురుటినొప్పులు వచ్చి, వైద్యసిబ్బంది సహకారంతో ఆసుపత్రికి చేరుకొని బిడ్డను ప్రసవించిన బాలింతను, వారి బంధువులను మంత్రి ఆసుపత్రిలో పరామర్శించారు. సకాలంలో స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రసవానికి సహకరించిన సిబ్బందిని, వైద్యులను ఈ సందర్బంగా మంత్రి అభినందించారు. తుఫాను ప్రభావం, కలిగిన నష్టాలపై ఎంపిడిఓ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెద్దగా నష్టం లేకుండానే తుఫాను నుంచి బయటపడ్డామని అన్నారు. జిల్లా స్థాయితోపాటు, క్షేత్రస్థాయి నుంచి సైతం అధికార యంత్రాంగం చక్కని పనితీరు కనపరిచి, అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న 300కు పైబడి గర్భిణులను ముందుగానే ఆసుపత్రికి తరలించారని తెలిపారు. అక్కడక్కడా పంట మునక, చెరువులకు గండ్లు, రహదారులు దెబ్బతినడం లాంటి కొన్నినష్టాలు జరిగాయని, ప్రస్తుతం అధికారులు వాటి అంచనాలు రూపొందిస్తున్నారని చెప్పారు. ఈ పర్యటనలో మండల ప్రత్యేకాధికారి రమేష్, ఇతర అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
………………………… ………………………… ………………………… ……………………
జారీ ః జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజయనగరం

2910-A

2910-B

2910-C

2910-D