29.12.2025 డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు — జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
Publish Date : 30/12/2025
పత్రికా ప్రకటన-5
డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు
— జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, డిసెంబర్ 29: డీలర్లు నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లింపుచేసినా సంబంధిత డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఉదయం వ్యవసాయ అధికారులు తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం విత్తిన, భవిష్యత్ లో విత్తనున్న పంటలకు సంబంధించి ఎరువులు అవసరమైన గ్రామాలు, మండలాలను గుర్తించి ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. చెరువులు మరియు ఇతర వనరుల ద్వారా నీటి వసతి బాగా ఉండటంతో, గత సంవత్సరం కంటే ఈసారి మొక్కజొన్న మరియు కూరగాయల సాగు పెరిగే అవకాశం ఉన్నందున అందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వచ్చే 15 రోజులకు అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మండలాల వారీ పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ముందుగానే అంచనా వేసి, రాష్ట్ర స్థాయికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి ఎరువుల డీలర్ వద్ద యూరియా నిల్వల వివరాలు తెలియజేసే స్టాక్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రైతులు యూరియా కొనుగోలు చేసే సమయంలో బస్తాపై ముద్రించిన ఎం.ఆర్.పీ ధరలను పరిశీలించి, అదే ప్రకారం ధర చెల్లించి, తప్పనిసరిగా డీలర్ నుండి రసీదు పొందేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డీలర్లు ఇతర ఉత్పత్తులతో కలిపి విక్రయించినా, ఎం.ఆర్.పీ కంటే అధిక ధరలకు విక్రయించినా, వారి లైసెన్సులు రద్దు చేసి, ఎరువుల నియంత్రణ చట్టం, 1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాధికారి విటి రామారావు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
==========
జారీ: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విజయనగరం

29-12