District Collector Suryakumari directs the Secretariat staff to take immediate action to address public concerns, focus more on the Citizen Outreach program.
Publish Date : 21/10/2021
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
సిటిజన్ ఔట్ రీచ్ కార్యక్రమంపై అధిక దృష్టి సారించాలి
సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆదేశాలు
వేపాడ మండలంలో సచివాలయం, రైతుభరోసా కేంద్రాల తనిఖీ
విజయనగరం, అక్టోబరు 20; గ్రామ సచివాలయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి అన్నారు. గ్రామీణ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఏ సమస్యనైనా సచివాలయ స్థాయిలోనే పరిష్కరించేలా సచివాలయ సిబ్బంది చొరవ చూపాలన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం వేపాడ మండలంలో పర్యటించారు. జాకేరులో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. వాటి పనితీరు, ప్రజలకు ఆయా కార్యాలయాల ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలపై ఆరా తీశారు. ముందుగా గ్రామ సచివాలయం తనిఖీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అర్హులందరికీ పథకాలు అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. సచివాలయానికి వచ్చిన వినతులు ఏ మేరకు పరిష్కారం అవుతున్నదీ తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరువుతున్నదీ లేనిదీ పరిశీలించారు. సచివాలయంలోని పలు రిజిష్టర్లను తనిఖీ చేశారు.
గ్రామ సచివాలయ సిబ్బంది సిటిజెన్ ఔట్ రీచ్ కార్యక్రమంపై అధికంగా దృష్టి సారించి ఆయా పథకాలు ఏవిధంగా అర్హులకు అందుతున్నదీ తెలుసుకోవాలన్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి వుంటే వారికి పథకాలు అందించే ప్రయత్నం చేయాలన్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ పై కూడా కలెక్టర్ ఆరా తీశారు. గ్రామంలో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నదీ ఆరోగ్య సహాయకులను అడిగి తెలుసుకున్నారు. శతశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.
అనంతరం రైతుభరోసా కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామ వ్యవసాయ సహాయకుడితో మాట్లాడి ఇ-పంట నమోదు, ఇటీవల వర్షాలకు పంటనష్టం వివరాల నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. గ్రామంలో ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్, ఎంపిటిసి తదితరులు కూడా పర్యటనలో పాల్గొన్నారు.
2) జాకేరులో గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
3) జాకేరులో రైతుభరోసా కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్