Get ready to buy grain , Make all arrangements in advance- J.C. Kishore Kumar orders at District Procurement Committee meeting
Publish Date : 25/10/2021
*ధాన్యం కొనుగోలుకు సమాయత్తంకండి*
*అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేసుకోండి
*జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశంలో జేసీ కిశోర్ కుమార్ ఆదేశాలు
విజయనగరం, అక్టోబర్ 23 ః ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు అన్ని విభాగాల అధికారులు సమాయత్తం కావాలని, అన్ని ఏర్పాట్లూ ముందుగానే చేసుకొని సిద్దంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ జేసీ కిశోర్ కుమార్ ఆదేశించారు. ఏలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సన్నద్ధతపై శనివారం ఆయన ఛాంబర్లో జరిగిన జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఈ సారి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సుమారు 800 పీపీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ పేర్కొన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమాచారం తెలిపే విధంగా పూర్తి వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రం ఎక్కడ ఉందనే సమాచారం రైతులకు తెలిసేలా సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో తప్పకుండా మాయిశ్చర్ మీటర్‌ను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల నుంచి సేకరించిన శాంపిల్స్ తాలూక వివరాలను సరిగా పొందుపరచాలని పేర్కొన్నారు.
*మద్దతు ధరపై రైతులకు అవగాహన*
ధాన్యం సేకరించడానికి ముందే రైతులకు సంబంధిత మద్దతు ధర వివరాలను తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సాధారణ రకం ఒక క్వింటాకు ప్రస్తుతం రూ.1940, ఏ గ్రేడు రకం క్వింటాకు రూ.1960 ఇస్తున్న విషయాన్ని రైతులకు తెలిపాలని సూచించారు.
*ఈ-క్రాప్ విధానంపై ప్రత్యేక దృష్టి సారించండి*
ఈ క్రాప్ విధానంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ సూచించారు. ఆర్‌బీకేల్లో నమోదు చేస్తున్న వివరాలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని సూచించారు. వివరాల వాలిడేషన్‌లో అవకతవకలు జరిగినట్లయితే ఆయా మండల వ్యవసాయ అధికారులు, స్థానిక వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని జేసీ హెచ్చరించారు. ఈ క్రాప్ వివరాల నమోదులో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రాథమికంగా రైతుల నుంచి సేకరించే వివరాలు సీజన్ పూర్తయ్యే వరకు సరిపోయేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు.
*ప్రత్యామ్నాయ ఖాతాలను తెరుచుకోవాలి*
25 క్వింటాళ్ల కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసిన రైతుకు జనధన్ ఖాతాలు ఉంటే బిల్లుల చెల్లింపులో సమస్యలు వస్తాయి. కావున 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ లేదా రూ.50వేల కంటే ఎక్కువ లావాదేవీలు చేసే రైతులను ముందుగానే ప్రత్యామ్నాయ బ్యాంకు ఖాతాలను తెరిపించాలని అధికారులకు సూచించారు. ఈ విషయంపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ ఖాతాలను తెరిచిన రైతులు సంబంధిత వివరాలను ఆర్.బి.కేల్లో లేదా పీపీసీల్లో అందజేయాలని జేసీ స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రెసిడెంట్ కొండబాబు, డీఆర్‌డీఏ పీడీ అశోక్ కుమార్, డీఎస్‌వో పాపారావు, వ్యవశాయ శాఖ డీడీలు ఆనందరావు, నంద్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఏవీ శ్యామ్ కుమార్, డీసీసీబీ డీఎం, మార్కఫెడ్, టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్, తదితర అధికారులు పాల్గొన్నారు.