We will develop tourism, District Collector A. Suryakumari
Publish Date : 12/11/2021
పర్యాటకపరంగా అభివృద్ది చేస్తాం
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
మన్యంలో విస్తృత పర్యటన
సచివాలయం, అంగన్వాడీ కేంద్రాల సందర్శన
విద్యార్థులతో సహపంక్తి భోజనం
గుమ్మలక్ష్మీపురం, కురుపాం, (విజయనగరం), నవంబరు 12 ః జిల్లాను పర్యటకపరంగా అభివృద్ది చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. నిధుల సర్దుబాటును బట్టి, దశలవారీగా అభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ది చేసే లక్ష్యంతో ఆమె ఈ పర్యటన జరిపారు.
ఈ సందర్భంగా జిఎల్పురం ఐటిడిఏ క్యాంపు ఆఫీసులో, కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేయయడం, ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్టు చెప్పారు. జిల్లాను పర్యాటక పరంగా అభివృద్ది చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాలను గుర్తించి, వాటిని దశలవారీగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలను రూపొందించనున్నట్లు వెళ్లడించారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా, పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పద్దతిలో కూడా ఏదైనా సంస్థలు ముందుకు వస్తే, వాటికి సంపూర్ణంగా సహకరించి, పర్యాటక ప్రదేశాలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఎంపి ల్యాడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని, వీటితో ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
గుమ్మలక్ష్మీపురం మండలం కుశ జలపాతాన్ని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలోని గిరిజనులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. కుశ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల నిర్వహణను పరిశీలించారు. పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని, పోషకాహారాన్ని అందించి, వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. సవరకోటపాడు గ్రామంలోని ఉద్యానవనాన్ని సందర్శించారు. తాడికొండ సమీపంలోని జలపాతాన్ని సందర్శించి, అభివృద్దికి కృషి చేస్తామన్నారు. అక్కడి ఎపి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వెలుగు సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు, కమ్యూనిటీ భవనం నిర్మాణానికి, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణానికి, ఆశ్రమ పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కురుపాం మండలం దూలికుప్ప అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లల ఆరోగ్యంపై ఆరా తీవారు. రస్తాకుంటుబాయి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును, ఇతర రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. ప్రజలనుంచి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కోవిడ్ వేక్సినేషన్పై ఆరా తీశారు. ప్రతీఒక్కరూ వేక్సిన్ వేసుకొనేలా కృషి చేయాలని, శతశాతం వేక్సినేషన్ జరగాలని సూచించారు. తన పర్యటనలో ప్రజల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పర్యటనలో పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, ఐటిడిఎ పీవో ఆర్.కూర్మనాధ్, తాసిల్దార్లు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.