Accelerate Home Rights Scheme District Collector A. Suryakumari
Publish Date : 17/11/2021
గృహహక్కు పథకాన్ని వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 16 ః
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలును వేగవంతం చేయాలని, అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకంపై తన ఛాంబర్‌లో మంగళవారం సమీక్షించారు. జిల్లాలోని మండలాలు, మున్సిపాల్టీల వారీగా ఈ పథకం ప్రగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒన్‌టైమ్ సెటిల్మెంట్ పథకానికి లబ్దిదారులనుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 148 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సుమారు రూ.16 లక్షలను చెల్లించారని చెప్పారు. గృహ లబ్దిదారులకు ఈ పథకం వరం లాంటిదని, రుణాన్ని, వడ్డీని కూడా ఒకే విడతలో చెల్లించి, ఆ ఇంటిపై సంపూర్ణ హక్కును పొందవచ్చని పేర్కొన్నారు. రుణం నుంచి విముక్తి పొందడమే కాకుండా, ఆ ఇంటిపై శాశ్వతంగా హక్కును పొందే సువర్ణావకాశాన్ని ఈ పథకం కల్పిస్తోందని చెప్పారు. అతితక్కువ మొత్తంతోనే అన్నిహక్కులు లభిస్తాయని అన్నారు. ఓటిఎస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, దీనిని సద్వినియోగం చేసుకొనేలా చూడాలని అన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి, లబ్దిదారులకు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు. ఇప్పటివరకు 50శాతం డేటాను మాత్రమే ఆన్‌లైన్ చేయడం జరిగిందని, మిగిలిన దానిని కూడా వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, హౌసింగ్ పిడి ఎస్.కూర్మినాయుడు, ఇఇ ఎస్‌వి రమణమూర్తి, విజయనగరం తాశీల్దార్ ఎం.ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.