District Collector Suryakumari congratulated the young skater
Publish Date : 24/11/2021
యువతకు స్ఫూర్తి గుణ ప్రవల్లిక – స్కేటర్గా మరెన్నో విజయాలు సాధించాలి
యువ స్కేటర్ కు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి అభినందన
విజయనగరం, నవంబరు 23; విభిన్న రంగాల్లో ప్రతిభ చూపుతూ అన్నింటిలోనూ విజయాలు సొంతం చేసుకుంటున్న స్కేటింగ్ క్రీడాకారిణి వి.గుణ ప్రవల్లిక తోటి విద్యార్ధులు, జిల్లా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. నగరానికి చెందిన జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి వి.గుణ ప్రవల్లిక ఈనెల 18 నుంచి 21 వరకు విశాఖపట్నంలో జరిగిన 33వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య ఈ పోటీలను నిర్వహించింది. తాను సాధించిన పతకాలతో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారిని ప్రవల్లిక మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019లోనూ జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో మెడల్స్ సాధించడంతోపాటు పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్లోనూ ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయిలో 30వరకు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొంటూ ఆమెను అభినందించారు. ఢిల్లీ, ముంబై, పూనే తదితర ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో తాను పాల్గొన్నట్టు ప్రవల్లిక జిల్లా కలెక్టర్కు వివరించింది. రెండున్నరేళ్ల వయసు నుంచే స్కేటింగ్ ప్రాక్టీసు మొదలు పెట్టానని, తన తల్లిదండ్రులు శ్రీనివాసరావు, లక్ష్మి తన కోచ్ ప్రోత్సాహంతోనే తాను ఈ విజయాలు సాధించానని ప్రవల్లిక తెలిపింది. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి, దేశానికి, మన ప్రాంతానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆకాక్షించారు. ప్రవల్లిక స్ఫూర్తితో జిల్లాలోని విద్యార్ధులు, యువత పట్టుదలతో విద్యతోపాటు క్రీడలు, కళలు వంటి విభిన్న రంగాల్లో రాణించి తమ సత్తా చాటాలని కలెక్టర్ పేర్కొన్నారు.