District Collector A. Suryakumari will be inspecting government lands in New Wales & Greenfield Highway Land Acquisition Complete by the end of the month
Publish Date : 09/12/2021
నెలాఖరులోగా గ్రీన్ఫీల్డు హైవే భూసేకరణ పూర్తి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
కొత్తవలసలో ప్రభుత్వ భూములను పరిశీలించిన కలెక్టర్
విజయనగరం, డిసెంబరు 08 ః
ఈ నెలాఖరులోగా విశాఖపట్నం-రాయ్పూర్ గ్రీన్ఫీల్డు హైవే భూసేకరణను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి అన్నారు. ఇప్పటికే మూడు ప్యాకేజీలు దాదాపు పూర్తయ్యాయని, చివరి ప్యాకేజీ భూసేకరణ జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
కొత్తవలస మండలంలో కలెక్టర్ సూర్యకుమారి బుధవారం విస్తృతంగా పర్యటించారు. అర్ధానపాలెం, రెల్లి, బలిఘట్టంలో ఉన్న ప్రభుత్వ భూములను ఆమె పరిశీలించారు. అనంతరం కొత్తవలస తాశీల్దార్ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. గ్రీన్ ఫీల్డు హైవే ట్రాక్ అలైన్మెంట్ ఎట్టిపరిస్థితిలోనూ మారబోదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రెల్లిలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములను పారిశ్రామిక అవసరాలకోసం వినియోగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. పెద్ద పరిశ్రమలు వస్తే, దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతాయని చెప్పారు. ప్రయివేటు పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దీనివల్ల స్థానికంగా ఉపాధిఅవకాశాలు కలుగుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
సచివాలయ సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నారు. నగదు చెల్లించి తమ ఇంటిని రిజిష్ట్రేషన్ చేయించుకొనేందుకు లబ్దిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించామని అన్నారు. జగనన్న కాలనీల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. మీడియా సమావేశంలో తాశీల్దార్ రమణ, ఎంపిడిఓ వెంకటరావు పాల్గొన్నారు.