District Collector A. Suryakumari Review with Zonal Special Officers
Publish Date : 29/12/2021
సమన్వయంతోనే సత్ఫలితాలు
ఫోర్టిఫైడ్ రైస్ ప్రయోజనాలను వివరించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
మండల ప్రత్యేకాధికారులతో సమీక్ష
విజయనగరం, డిసెంబరు 27 ః వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయని, దీనికి ప్రత్యేకాధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. మండలాల ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఫలితాలు, సాంకేతిక సమస్యలు, శాఖలమధ్య సమన్వయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలమద్య సమన్వయం, పరస్పర సహకారం అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా కోవిడ్ వేక్సినేషన్, ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు, రెండుమూడు శాఖలు కలిపి చేయాల్సి ఉందని, ఇలాంటిప్పుడు, సిబ్బంది మధ్య సమన్వయం అవసరమని అన్నారు. సమన్వయం లేకపోతే, పనులు ఆగిపోవడమే కాకుండా, ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ శాఖలు తమకు నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడంలో ముందుంటున్నాయని, ఇతర శాఖలతో కలిపి చేయాల్సి పనుల విషయంలో సమన్వయ లోపం కనిపిస్తోందని చెప్పారు. సమన్వయం చేయాల్సిన బాద్యత మండల ప్రత్యేకాధికారులపై ఉందని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమల్లో తాశీల్దార్, ఎంపిడిఓలు ఇద్దరికీ బాధ్యత ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడే, కార్యక్రమం బాగా అమలవుతుందని అన్నారు.
ఫోర్టిఫైడ్ రైస్ ఎంతో బలవర్ధకమని, వీటిని ప్రతీఒక్కరూ వినియోగించేలా చూడాలని కలెక్టర్ కోరారు. బియ్యం కడిగేటప్పుడు, పైకి తేలుతున్న గింజలను బయటకు తీసివేయకూడదని, వాటిని కూడా తప్పనిసరిగా వినియోగించేలా ప్రజల్ని చైతన్యపరచాలని సూచించారు. మంచాన పడిన దీర్ఘరోగులు మినహా, ఎవరికీ మినహాయింపు లేకుండా, ప్రతీఒక్కరికీ కోవిడ్ వేక్సినేషన్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆరా తీశారు. ధాన్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాలని రైతులపై ఒత్తిడి తేవొద్దని, వారి ఇష్టం మేరకు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించుకున్నప్పటికీ, వారు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా చూడాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి ఇంకా కొన్ని గ్రామాల్లో భూమిని సేకరించాల్సి ఉందని, దానిపై తాశీల్దార్లతో చర్చించాలని చెప్పారు. మహిళా పోలీసులు అంన్వాడీ కేంద్రాలకు వెళ్లి, పిల్లల ఎత్తు, బరువు తనిఖీ చేసి, నివేదికలు తయారుచేసేవిధంగా, వారికి తర్ఫీదునివ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు, పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన, వివిధ శాఖల అధికారులు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
