* Grain Purchasing Centers in R.B.K * * Take the grain directly there and sell it ** J.C. Kishore Kumar, who appealed to the farmers in Dial Your JC *, said that he did not want to resort to the millers …
Publish Date : 03/01/2022
*ఆర్బీకేల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు*
* ధాన్యాన్ని నేరుగా అక్కడికే తీసుకెళ్లి విక్రయించండి
**డయల్ యువర్ జేసీ*లో రైతులకు విజ్ఞప్తి చేసిన జేసీ కిశోర్ కుమార్
* మిల్లర్లను ఆశ్రయించవద్దని… ఇబ్బందులు పడొద్దని హితవు
విజయనగరం, డిసెంబర్ 30 ః పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు భరోసా కేంద్రాలకే తీసుకెళ్లి విక్రయించుకోవాలని, మిల్లర్లను, దళారులను ఆశ్రయించి అనవసరంగా ఇబ్బందులు పడొద్దని జిల్లాలోని రైతులకు జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులందరూ అక్కడికే వెళ్లాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నేరుగా రైతులతో మాట్లాడే నిమిత్తం ఆయన గురువారం ఉదయం 9.00 నుంచి 10.00 వరకు డయల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా తన ఛాంబర్ నుంచి నేరుగా రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి అనూస్య స్పందన లభించింది.
డయల్ యువర్ జేసీలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 30 మంది రైతులు వివిధ సమస్యలను జేసీ దృష్టికి తీసుకొచ్చారు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదని, గోనె సంచులు అందజేయలేదని తెలిపారు. కొంతమంది మిల్లర్లు మార్జిన్లు అడుగుతున్నారని, తేమ శాతం బాగోలేదనే నెపంతో ధర తగ్గిస్తున్నారని వివరించారు. అలాగే కొన్ని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది సరిగా స్పందించలేదని, తిప్పి పంపుతున్నారని పేర్కొన్నారు.
వీటిన్నింటిపైనా జేసీ స్పందిస్తూ ఈ ఏడాది రైతుల సౌకర్యార్థం రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఎడ్వయిజరీ బోర్డు సూచనల మేరకే ఈ సారి రైతు భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలోని సుమారు 140 మిల్లులను ఆర్.బి.కె.లకు అనుసంధానం చేశామని స్పష్టం చేశారు. రైతులందరూ తప్పకుండా వారు పండించిన ధాన్యాన్ని కేవలం రైతు భరోసా కేంద్రాలకు మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు. మిల్లర్లను ఆశ్రయించవద్దని, అనవసరంగా ఇబ్బందులు పడొద్దని హితవు పలికారు. గోనె సంచులు ప్రతి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ధరల్లో వ్యత్సాసం ఉండదని, సాధారణ రకం క్వింటాకు రూ.1940, ఏ గ్రేడు రకం రూ.1960 కనీస మద్దతు ధర అందేస్తామని వివరించారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీ అయిన రైతులు పట్టాదార్ పాసు పుస్తకాలతో సంబంధం లేకుండా ధాన్యం విక్రయించుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే గజపతినగరం, గరివిడి మండలాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ల పనితీరుపై ఫిర్యాదులు రాగా పరిశీలించిన చర్యలు తీసుకుంటామని జేసీ పేర్కొన్నారు. ఇంచుమించు జిల్లాలోని అన్ని మండలాల నుంచి రైతులు స్పందించి జేసీతో మాట్లాడారు.
డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో డీఎస్వో పాపారావు, జిల్లా సహకార అధికారి అప్పలనాయుడు, మార్కెటింగ్ శాఖ ఏడీ వైవి శ్యామ్ కుమార్, సివిల్ సప్లై టెక్నికల్ ఎ.ఎం. మీనా కుమారి పాల్గొన్నారు.