Convergence work should be completed by March, deadline for OTS is Ugadi, District Collector A. Suryakumari, Chinabhogi Secretariat
Publish Date : 05/03/2022
కన్వెర్జెన్సీ పనులను మార్చ్ లోగా పూర్తి చేయాలి
ఓటీఎస్ కు ఉగాది వరకే గడువు
జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
చినభోగిల సచివాలయం తనిఖీ
సీతానగరం (విజయనగరం), మార్చ్ 04 : ఉపాధిహామీ కన్వెర్జెన్సీ పనులను ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి ఆదేశించారు. ప్రారంభించని పనులను రద్దుచేసి, వేరే గ్రామాలకు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
సీతానగరం మండలం చినభోగిల గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ముందుగా రిజిస్టర్లను, బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. వివిధ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులు, కోవిడ్ వేక్సినేషన్, ఆరోగ్య తనిఖీలు, ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగం, ల్యాండ్ సర్వే, సిటిజన్ అవుట్ రీచ్ సర్వే, జగనన్న కాలనీల నిర్మాణం, ఓటీఎస్, ఉపాధి హామీ పనులపై సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఏడాది ఉగాది వరకే ఓటీఎస్ కు గడువు ఉందని, ఆలోగా ఈ పధకాన్ని వినియోగించుకొనేలా లబ్ధిదారులను చైతన్య పరచాలని సూచించారు. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోను ఉపాధి కన్వెర్జెన్సీ నిధులను వినియోగించాలని ఆదేశించారు. గ్రామంలో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాన్ని మరో నాలుగు రోజుల్లోగా మొదలుపెట్టకపోతే, రద్దుచేసి వేరే గ్రామానికి మంజూరు చేస్తానని చెప్పారు. చెరువు పనులను పూర్తి చేసిన తరువాత, గట్టు చుట్టూ మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు పార్వతీపురం మండలం నర్సిపురం జగనన్న కాలనీని కలెక్టర్ పరిశీలించారు.
ఈ తనిఖీలో సీతానగరం తాసిల్దార్ పి.చిట్టిబాబు, ఎంపిటిసి జి.బుజ్జి, గ్రామ పెద్ద కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.