Land reserve with special technology in signalless villages, Steps to complete expeditiously – District Collector A. Suryakumari
Publish Date : 25/03/2022
సిగ్నల్ లేని గ్రామాల్లో ప్రత్యేక టెక్నాలజీతో భూముల రీసర్వే
వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు – జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి
విజయనగరం, మార్చి 24 : మొబైల్ సిగ్నల్ లేని గ్రామాల్లో ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎల్-బ్యాండ్ రోవర్ల ద్వారా భూముల రీసర్వే పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి తెలిపారు. జిల్లాలో నో సిగ్నల్ గ్రామాలు 320 వున్నట్టు గుర్తించామని వీటన్నింటిలో ప్రత్యేక టెక్నాలజీతో రీసర్వే చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు. జిల్లాలో ప్రస్తుతం విజయనగరం, పార్వతీపురం డివిజన్లకు ఒక్కో డ్రోన్ వంతున వున్నాయని, భూముల రీసర్వే వేగవంతం చేసేందుకు మరో 3 డ్రోన్లు అదనంగా పంపించాలని కోరామన్నారు. వై.ఎస్.ఆర్. జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకంపై భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.సాయిప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడారు.
జిల్లాలో రెండో విడత భూముల రీసర్వే కార్యక్రమంలో 24 మండలాల్లోని 78 గ్రామాల్లో రీసర్వే చేపట్టడం జరిగిందన్నారు. వీటిలో 19 గ్రామాల్లో 13 నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. జిల్లాలో భూముల రీసర్వే వేగవంతం చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న సి.సి.ఎల్.ఏ. సాయిప్రసాద్, సర్వే, భూరికార్డుల కమిషనర్ సిద్ధార్ద్ జైన్ తదితరులు ఆయా జిల్లాల్లో సమగ్ర భూముల రీసర్వే వేగవంతం చేయడంలో అనుసరించాల్సిన విధానాలపై సూచనలు చేశారు.
జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.ఆర్.మహేష్ కుమార్, సర్వే విభాగం ఏ.డి. టి.త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు.