Close

Order for the removal of volunteers who are frequently absent from duty, District Collector who has inspected the ward secretariats in the city.

Publish Date : 26/03/2022

విధుల‌కు త‌ర‌చూ గైర్హాజ‌ర‌వుతున్న వ‌లంటీర్ తొల‌గింపున‌కు ఆదేశం

న‌గ‌రంలో వార్డు స‌చివాల‌యాలు త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్‌

విజ‌య‌న‌గ‌రం, మార్చి 25 :విధుల‌కు త‌ర‌చుగా గైర్హాజ‌ర‌వుతున్న వార్డు వ‌లంటీర్‌ను తొల‌గించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి మునిసిప‌ల్ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలోని బి.సి.కాల‌నీ ప్రాంతంలో వున్న 44, 45 నెంబ‌రు వార్డు స‌చివాల‌యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్య‌కుమారి శుక్రవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా వార్డు స‌చివాల‌య సిబ్బంది, వ‌లంటీర్ల హాజ‌రు గురించి క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. 45వ స‌చివాల‌యం ప‌రిధిలోని వార్డు వ‌లంటీరు శిరీష హాజ‌రు కేవ‌లం 16శాతం వుంద‌ని తెలియ‌డంతో ఆమె ప‌నితీరు బాగోలేద‌ని వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు.

వార‌సురాలిగా త‌న త‌ల్లి ఆస్తిని అనుభ‌విస్తూ కూడా త‌ల్లి బాగోగుల‌ను ప‌ట్టించుకోకుండా ఆమెను ఇంటి బ‌య‌టికి పంపించ‌డానికి ప్ర‌య‌త్నించిన ఆమె కుమార్తెపై కూడా కేసు న‌మోదు చేయాల‌ని మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శిని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 45వ స‌చివాల‌యం ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని, ఆ ఇంటి చుట్టుప్ర‌క్క‌ల వారంతా ఆ వృద్ధురాలిని చేర‌దీసి ఆమె కుమార్తెను నిల‌దీయ‌డంతో ఇంట్లోకి తీసుకువెళ్లార‌ని మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి జిల్లా క‌లెక్ట‌ర్ కు వివ‌రించారు.

వార్డు ప‌రిధిలో గృహ‌హింస కేసులు, ఇత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. గ‌ర్భిణీల‌కు అబార్ష‌న్‌లు వంటివి ఏమైనా జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు ఏమైనా న‌మోద‌య్యాయా అనే అంశంపై కూడా క‌లెక్ట‌ర్ తెలుసుకున్నారు. న‌మోదైన గ‌ర్భిణీల్లో ఎవ‌రికైనా అబార్ష‌న్‌లు జ‌రిగితే వాటిపై దృష్టిసారించాల‌ని ఆదేశించారు.

అంగ‌న్‌వాడీల్లో పిల్ల‌ల బ‌రువు, ఎత్తు కొల‌త‌లు తీస్తున్న‌దీ లేనిదీ ఆరా తీశారు. బ‌రువు త‌క్కువ‌గా పిల్ల‌లు ఎవ‌రైనా వున్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు.

స‌చివాల‌యం ద్వారా అందుతున్న రెవిన్యూ సేవ‌ల‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్షించారు. ఆదాయ, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాల జారీలో జాప్యంపై వి.ఆర్‌.ఓ.ను ప్ర‌శ్నించారు. వార్డు ప‌రిధిలో పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ గురించి ఆరా తీయ‌గా, ఈ ప్రాంతంలో డ్రెయిన్ నిర్మించాల్సి వుంద‌ని పారిశుధ్య కార్య‌ద‌ర్శి తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు వుంటే డ్రెయిన్ నిర్మాణానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌మ‌న్వ‌య అధికారి హ‌రీష్‌కు సూచించారు.

Order for the removal of volunteers who are frequently absent from duty, District Collector who has inspected the ward secretariats in the city.