The aim should be to ensure that every girl gets a degree, to prevent underage marriages, to direct the District Collector to direct women and child welfare staff, and to improve services in the Secretariat; District Collector, Nellimarla Ward Secretariat inspected by District Collector Smt. Suryakumari
Publish Date : 01/04/2022
ప్రతి బాలిక డిగ్రీ వరకు చదవాలన్నదే లక్ష్యం
తక్కువ వయసులో జరిగే వివాహాలను నిరోదించాలి
మహిళాశిశు సంక్షేమ సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు
సచివాలయంలో సేవలు మెరుగుపడాలి ; జిల్లా కలెక్టర్
నెల్లిమర్లలో వార్డు సచివాలయం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి
విజయనగరం(నెల్లిమర్ల), ఏప్రిల్ 01 :తక్కువ వయస్సులోనే బాలికలు వివాహాలు జరగకుండా నిరోధించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బంది మహిళలు, తల్లిదండ్రుల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించాల్సి వుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రతి బాలిక కనీసం డిగ్రీ పూర్తిచేయాలన్నదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఆడపిల్లల్ని కనీసం డిగ్రీ వరకు చదివిస్తే వారి తల్లిదండ్రులకు వెంటనే పెళ్లి చేయాలన రాదన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు బాలికలు విద్యాభ్యాసం పూర్తిచేయకుండా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే బాలికలు దానిని వ్యతిరేకించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి శుక్రవారం నెల్లిమర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొయిద కూడలిలో వున్న వార్డు సచివాలయాన్ని తనిఖీ చేశారు. మహిళాశిశు సంక్షేమశాఖ పనితీరును కలెక్టర్ సమీక్ష చేసిన సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీలపై పర్యవేక్షణ మరింతగా పెరగాలన్నారు. మహిళా పోలీసు పనితీరుపై సమీక్షించారు. మహిళలకు సైబర్ క్రైమ్, దిశ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణంపై సమీక్షించి ఎన్ని ఇళ్లు నిర్మాణం జరుగుతున్నదీ ఇంజనీరింగ్ సహాయకుని అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో చెత్త సేకరణ, వర్గీకరణ జరుగుతున్న తీరుపై తెలుసుకున్నారు. సచివాలయంలో ఏ.ఎన్.ఎం. పోస్టులు లేకపోవడంపై ప్రశ్నించారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారితో ఫోన్‌లో మాట్లాడి పట్టణాల్లో ఆరోగ్య సేవలపై ఆరా తీశారు. ఫోర్టిఫైడ్ బియ్యం పై ప్రజల్లో ఏవిధంగా అవగాహన కల్పిస్తున్నదీ తెలుసుకున్నారు. ఎండిఎం వాహనాల్లో వుండే మైకుల ద్వారా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో ఫోర్టిఫైడ్ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రచారం చెయ్యాలని తహశీల్దార్ కె.వి.రమణరాజును ఆదేశించారు.
సచివాలయం పరిధిలో సిబ్బంది, వలంటీర్ల బయో మెట్రిక్ హాజరును కలెక్టర్ పరిశీలించారు. ముగ్గరు వలంటీర్లు హాజరు తక్కువగా వుండటాన్ని గమనించి దీనిపై ప్రశ్నించారు. హాజరు మరీ తక్కువగా వున్న ఒక వలంటీరును తొలగించాలని, మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు సరిగా నమోదు చేస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. స్కూళ్లలో చదువుతున్న బాలికలకు హెమోగ్లోబిన్ పరీక్షలపై ఆరా తీశారు. ఆరుగురు పిల్లలు తక్కువ బరువు వున్నట్టు నమోదయ్యిందని మహిళా పోలీసు వివరంచారు.
జిల్లా కలెక్టర్ వెంట తహశీల్దార్ కె.వి.రమణరాజు, మునిసిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు వున్నారు.