District Collector Suryakumari in a review on efforts and education to achieve 100% literacy in the district
Publish Date : 16/04/2022
టెన్త్, ఇంటర్లో మెరుగైన ఫలితాలను సాధించాలి
వేసవిలో విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు
ప్రత్యేక క్రీడా శిక్షణాకార్యక్రమం
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
నాడూ-నేడు ఫేజ్-2 ప్రారంభించాలి
జిల్లాలో శతశాతం అక్షరాశ్యత సాధనకు కృషి
విద్యపై సమీక్షలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 16 ః
పదోతరగతి, ఇంటర్‌మీడియట్ పరీక్షల్లో గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. అందుకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని విద్యాశాఖల అధికారులను ఆదేశించారు. విద్య, అక్షరాశ్యతలపై తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఓలకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలను జారీ చేశారు.
*మెరుగైన ఫలితాలను సాధించాలి*
రానున్న పదో తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల్లో గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కరు కూడా పదోతరగతిలో ఫెయిల్ అవ్వకూడదని స్పష్టం చేశారు. పదోతరగతిలో బాగా చదివే విద్యార్థులు, మరింత మంచి గ్రేడ్ పాయింట్లు సాధించే విధంగా, వెనుకబడిన విద్యార్థులు కనీసం పాస్ మార్కులు సాధించే విధంగా వేర్వేరు ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిలో ఆత్మస్థైర్యాన్ని కల్పించి, పరీక్షలను ఎదుర్కొనేవిధంగా తయారు చేయాలన్నారు. ట్యూటర్ల ద్వారా ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా చూసిరాతలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ విధించాలని, విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులను ఏర్పాటు చేయాలని సూచించారు.
*వేసవిలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు*
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ కారణంగా చదువులు దెబ్బతిన్నాయని, కొందరికి కనీసం చదవడం రాయడం కూడా రావడం లేదని అన్నారు. అందువల్ల 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవిలో బ్రిడ్జి కోర్సులను నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛందంగా చదువు చెప్పేందుకు ముందుకు వచ్చే వారిని, సచివాలయాల్లో విద్యా సహాయకులను, వలంటీర్లను, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఉపాధ్యాయులను, ట్యూటర్లను, విద్యాశాఖలో, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసేవారిని ఈ కార్యక్రమానికి వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పిఇటిల ఆధ్వర్యంలో క్రీడా శిక్షణా కార్యక్రమాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ క్రీడలతోపాటు, యోగా, లేదా కర్రసాము, కత్తిసాము లాంటి సంప్రదాయ విద్యలను విద్యార్థులకు నేర్పించాలని సూచించారు.
అలాగే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు టైలరింగ్, డేటా ఎంట్రీ లాంటి వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల తరువాత విద్యార్థుల్లో ఇటు విద్యాపరంగా గానీ, అటు క్రీడల పరంగా గానీ గణనీయమైన మార్పు వచ్చేలా, ఈ సెలవులు ఉపయోగపడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
*శతశాతం అక్షరాశ్యత దిశగా అడుగులు వేయాలి*
విద్యలనగరంగా పేరుపొందిన మన జిల్లా, అక్షరాశ్యతలో వెనుకబడి ఉంటంపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో శతశాతం అక్షరాశ్యతను సాధించే దిశగా ప్రతీ శాఖా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖలు సంయుక్తంగా కృషి చేసి దీనిని సాధించేందుకు అవసరమైన కార్యాచరణను తయారు చేయాలని సూచించారు. ముఖ్యంగా మహిళల అక్షరాశ్యత మరింత తక్కువగా ఉందని, దీనిపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. సాదారణ ప్రజలతోపాటు ఉపాధిహామీ కూలీలు, డ్వాక్రా మహిళలు, వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులను తప్పనిసరిగా అక్షరాశ్యులను చేయాలని సూచించారు. దీనికోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారిని, మెరిట్ విద్యార్థులను, వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. రోజుకు కనీసం గంట పాటు విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు. కేవలం సంతకాలు నేర్పి వదిలేయకుండా, చదవడం, రాయడంతోపాటు, వారికి ఆర్థిక అక్షరాశ్యతను కల్పించి, కనీస జ్ఙానవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. దీనికోసం చిట్టిగురువులు తరహాలో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయాలని కోరారు.
*నాడూ-నేడు పనులను ప్రారంభించాలి*
నాడూ నేడు రెండో దశ పనులను ప్రారంభించేందుకు సిద్దం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఫేజ్-2 క్రింద జిల్లాలో 142 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, వీటిలో 78 పాఠశాలల్లో అదనపు తరగతి గదులను నిర్మించనున్నామని చెప్పారు. దీనికోసం అవసరమైన సిమ్మెంటు కూడా కొద్ది రోజుల్లో రానుందని,కావాల్సిన ఇసుక, ఇనుము సిద్దం చేసి ఉంచాలని సూచించారు. ఇదొక గొప్ప కార్యక్రమమని, దీనివల్ల విద్యరంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తల్లితండ్రుల కమిటీలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. అన్ని దానాలకంటే విద్యాదానం గొప్పదని, పాఠశాలలు, తరగతి గదుల నిర్మాణానికి దాతల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. స్థలాలను, భవనాలను దానం చేసేవారి పేర్లను ఆయా భవనాలను పెట్టడం జరుగుతుందని చెప్పారు.
*బాల్య వివాహాలను నివారించాలి*
బడి ఈడు పిల్లలంతా బడిబయట ఉండకుండా చూడాలని, వారంతా చదువుకొనేలా చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు. దీనికోసం చేపట్టిన సర్వేని త్వరగా పూర్తి చేయాలని ఎంఇఓలను ఆదేశించారు. ముఖ్యంగా బాల్య వివాహాలను నివారించాలని, ప్రస్తుతం మహిళల కనీస వివాహ వయసును 21కి పెంచడం జరిగిందని, దీనికోసం పోస్టర్లను ముద్రించి, విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. బాల్యవివాహాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల విలీనంపై దృష్టి పెట్టాలని, విద్యార్థులు బడికి రావడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అవసరమైతే వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం వల్ల విద్యార్థులకు, పాఠశాలలకు ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యే పక్షంలో, వాటిని డిఇఓ దృష్టికి తీసుకురావాలని ఎంఇఓలకు సూచించారు. ఖాళీ అవుతున్న అంగన్‌వాడీ భవనాల వివరాలను అందజేస్తే, వాటిని ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేక అవసరాలగల పిల్లలకు, అంథులకు, బదిరులకు, మానసిక వికలాంగత్వం ఉన్న విద్యార్థులకు విద్యాబోధనపై దృష్టి సారించాలని ఆదేశించారు. సహిత విద్యకు సంబంధించి, ఎవరికి ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్నా, సమన్వయ కర్త (సెల్ నెంబరు *9491767579*)ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో డివిఓ డాక్టర్ ఎఎం జయశ్రీ, ఆర్‌విఎం పిఓ డాక్టర్ స్వామినాయుడు, డిబిసిడబ్ల్యూఓ డి.కీర్తి, సోషల్ వెల్ఫేర్ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్, అడల్ట్ ఎడ్యుకేషన్ డిడి కె.సుగుణాకరరావు, ఐసిడిఎస్ పిడి శాంతకుమారి, ఆర్ఐఓ, డైట్ ప్రిన్సిపాల్ తదితర పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.