Gunkalam will provide houses to the beneficiaries, the layout should be developed as a township, District Collector A. Suryakumari
Publish Date : 19/04/2022
గుంకలాం లబ్దిదారులకు ఇళ్లు కట్టించి ఇస్తాం
లేఅవుట్‌ను టౌన్‌షిప్ గా అభివృద్ది చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 18 ః
రాష్ట్రంలోనే అతి పెద్ద జగనన్న కాలనీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గుంకలాం లేఅవుట్‌లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి, ఒక టౌన్ షిప్‌గా రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. విజయనగరం పట్టణ పేదలకోసం రూపొందించిన గుంకలాం, కొండకరకాం లేఅవుట్లను ఆమె సోమవారం సందర్శించారు. ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా లేఅవుట్లలోని కల్పిస్తున్న మౌలిక వసతులు, ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గుంకలాం లేఅవుట్‌పై ప్రత్యేక శ్రద్ద వహించి, ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. మూడో ఆప్షన్ ఎంచుకున్న లబ్దిదారులు అంగీకరిస్తే, వారికి కాంట్రాక్టర్ చేత ఇళ్లు కట్టించి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే ఒక ప్రముఖ నిర్మాణ కాంట్రాక్ట్ కంపెనీచేత ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం రూ.1.80 లక్షలతోపాటు, అదనంగా డ్వాక్రా మహిళలకు రూ.50వేలు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ ద్వారా ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే లబ్దిదారులనుంచి వెంటనే అంగీకార పత్రాలను తీసుకోవాలని సూచించారు. లబ్దిదారులు తాము సొంతంగా కూడా ఇంటిని నిర్మించుకోవచ్చని, అయితే వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించాలని స్పష్టం చేశారు. ముందుకు రాని లబ్దిదారుల ఇళ్లను రద్దుచేసి, అర్హులైన ఇతరులకు కేటాయించాలని సూచించారు.
గుంకలాం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నవారికి వెంటనే విద్యుత్ కనక్షన్ ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఇక్కడ రాత్రీపగలూ పనులు జరిగే విధంగా వీధిలైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రక్షణ కోసం కొద్ది రోజుల్లోనే పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే సామాజిక మరుగుదొడ్లను నిర్మించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సామాజిక భవనాన్ని, రెండు సచివాలయ భవనాలను, అర్బన్ హెల్త్ సెంటర్ భవనం, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. కొండకరకాం వద్ద రూపొందించిన లేఅవుట్‌ను సందర్శించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో హౌసింగ్ పిడి ఎన్‌వి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవాణి, మెప్మా పిడి సుధాకరరావు, తాశీల్దార్ బంగార్రాజు, హౌసింగ్ డిఇ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
