Achieve better results in Inter, make arrangements for examinations in a systematic manner, District Collector A. Suryakumari
Publish Date : 19/04/2022
ఇంటర్‌లో మెరుగైన ఫలితాలను సాధించాలి
పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
విజయనగరం, ఏప్రెల్ 18 ః
ఇంటర్ మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి ఆదేశించారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలపై తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి, వారి స్థాయిని బట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. మెరిట్ విద్యార్థులు పరీక్షల్లో మరింత రాణించేలా, వెనుకబడిన విద్యార్థులు కనీసం పాస్ మార్కులను సాధించేలా తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. దీనికోసం తరచూ పరిక్షల్లో వచ్చే ప్రశ్నలను, వచ్చే అవకాశం ఉన్న మోడల్ ప్రశ్నలను పత్రికల ద్వారా విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులకు ప్రాధమిక అంశాలను బోధించేందుకు వేసవి సెలవుల్లో బ్రిడ్జికోర్సులను నిర్వహించాలని కోరారు. బాలికల్లో డ్రాపౌట్స్ నివారించి, ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా, వారికి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో చైతన్య కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, అలాగే వివిధ ఆరోగ్య అంశాలపైనా అవగాహన కల్పించాలని సూచించారు.
మే 6వ తేదీనుంచి జిల్లాలో ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎక్కడా చూసి రాతలు, మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుధిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకోసం జిల్లాలో 66 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సుమారు 22,588 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 25,059 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. దీనికోసం మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల చుట్టుప్రక్కల జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకోసం మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్దంగా ఉంచాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్ఐఓ మజ్జి ఆదినారాయణ, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, వివిధ శాఖల ప్రతినిధులు, కమిటీ సభ్యులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.