Close

Appointment of Special Officers for Zones to oversee the implementation of priority programs- District Collector Suryakumari issued the latest orders in the wake of the division of the district

Publish Date : 19/04/2022

ప్రాధాన్యత కార్యక్రమాల అమ‌లుపై ప‌ర్యవేక్షణ‌కు మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల నియామ‌కం

జిల్లా విభ‌జ‌న నేప‌థ్యంలో తాజాగా ఉత్తర్వులు జారీచేసిన జిల్లా క‌లెక్టర్ సూర్యకుమారి

విజ‌య‌న‌గ‌రం, ఏప్రిల్ 19 :

జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో భౌగోళికంగా జిల్లా ప‌లు మార్పుల‌కు లోనుకావ‌డంతో జిల్లాలోని మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను తాజాగా నియ‌మిస్తూ జిల్లా క‌లెక్టర్ శ్రీ‌మ‌తి ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. పున‌ర్విభ‌జ‌న‌లో జిల్లా నుంచి కొన్ని మండ‌లాలు పార్వతీపురం మ‌న్యం జిల్లాకు వ‌దులుకోవ‌డం, శ్రీ‌కాకుళం నుంచి కొన్ని మండ‌లాలు జిల్లాలో చేర్చడంతో తాజాగా మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను నియ‌మిస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ త‌న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 27 మండ‌లాలు, విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర పాల‌క‌సంస్థ‌, రాజాం, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీల‌కు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ‌మించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమ‌లును ఆయా మండ‌లాల్లో ప‌ర్యవేక్షించడం, మండ‌ల స్థాయి అధికారుల‌ను స‌మ‌న్వయ‌ప‌ర‌చి ప్రభుత్వ కార్యక్రమాలు, ప‌థ‌కాల‌ను స‌మ‌ర్ధంగా అమ‌లు చేయ‌డం వంటి కార్యక‌లాపాల‌ను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తార‌ని జిల్లా క‌లెక్టర్ పేర్కొన్నారు. మండ‌లంలో అన్ని శాఖ‌ల అధికారుల‌తో సంయుక్త స‌మావేశాలు నిర్వహించి ఆయా కార్యక్రమాల అమ‌లుపై ప్రతి వారం స‌మీక్షించి జిల్లా ఉన్నతాధికారుల‌కు నివేదించాల్సి వుంటుంద‌ని ఆ ఉత్తర్వుల్లో క‌లెక్టర్ పేర్కొన్నారు.

ఆయా మండ‌లాల్లో గృహ‌నిర్మాణ ప్రగ‌తిని మెరుగుప‌ర‌చ‌డం, పబ్లిక్ ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్ధుల స‌న్నద్ధత‌ను ప‌ర్యవేక్షించి త‌గిన సూచ‌న‌లు చేయ‌డం, మ‌హిళ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌, వ్యాధి నిరోధ‌క టీకాల కార్యక్రమాన్ని ప‌ర్యవేక్షించ‌డం, అంగ‌న్‌వాడీ కేంద్రాల ప‌నితీరుపై త‌నిఖీలు చేసి మెరుగుప‌ర‌చ‌డం, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లుపై త‌గిన విధంగా ప‌ర్యవేక్షణ‌, గ్రామ వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించేలా సేవ‌ల‌ను మెరుగుప‌ర‌చ‌డం వంటి అంశాల‌పై ప్రత్యేక అధికారులు జిల్లా క‌లెక్టర్‌కు నివేదిక‌లు స‌మ‌ర్పించాల్సి వుంటుంద‌ని పేర్కొన్నారు. వీటితో పాటు ఆయా మండ‌లాల‌కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల‌పై జిల్లా యంత్రాంగం అప్పగించిన విధుల‌ను నిర్వహించాల్సి వుంటుంద‌ని పేర్కొన్నారు.

Appointment of Special Officers for Zones to oversee the implementation of priority programs- District Collector Suryakumari issued the latest orders in the wake of the division of the district